నో స్టాక్
బంకుల వద్ద భారీ ‘క్యూ’
శంకర్‌పల్లి: యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఉంటుందని వదంతులు పెద్దఎత్తున వ్యాప్తి చెందడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా అవకాశం ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల కొద్ది క్యూలు కడుతున్నారు. దీనికి తోడు కొంతమంది డబ్బాలను తీసుకొచ్చి, పెట్రోల్, డీజిల్‌లను తీసుకొని వెళ్తుండడం గమనార్హం. అయితే నిబంధనల ప్రకారం డబ్బాలలో ఇంధనం పోయకూడదని ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పలుచోట్ల రోజు కంటే ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు అవుతుండడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్ద వందల కొద్దీ జనాలు తమ ఖాళీ సిలిండర్లతో క్యూలు కట్టి, తీసుకెళ్తున్నారు. కొరత వదంతులపై బంకు యజమానులతో మాట్లాడగా.. గతంలో మాదిరే ఇంధనం వస్తుందని, జనాలు అవసరం లేకున్నా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లడంతో ఇబ్బంది తలెత్తుందన్నారు.
మొయినాబాద్: రెండు రోజులుగా పెట్రోల్, డీజీల్ కోసం బంకుల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు. వినియోగదారులు వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకోవడంతోపాటు డబ్బాల్లో నింపుకొంటున్నారు. బుధవారం సాయంత్రం వరకు భారీగా వాహనాలు క్యూకట్టాయి. సాయంత్రం 5 గంటల తరువాత స్టాక్ అయిపోవడంతో ఒక్కొక్కటిగా బంకులన్నీ మూసివేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు.
ఇబ్బంది పడుతున్న వాహనదారులు


