యాచారం: ఫార్మాసిటీ భూసేకరణలో నష్టపోయిన రైతులకు మెరుగైన పరిహారం అందజేసి, ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఫార్మాసిటీ భూ బాధిత గ్రామాలైన నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల రైతులతో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలవంతపు భూసేకరణతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. వివాదాల్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి తగిన పరిహారం అందజేయాలని అన్నారు. స్పందించిన కలెక్టర్ త్వరలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు తాడిపర్తి సర్పంచ్ నీలం ఝాన్సీ రైతు భరోసా నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లె వినయ్, దార సత్యం, కొత్త రవి, సామ నిరంజన్, నాగని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


