ఉంటే సరి.. లేదంటే రద్దే మరి! | - | Sakshi
Sakshi News home page

ఉంటే సరి.. లేదంటే రద్దే మరి!

Mar 24 2026 8:46 AM | Updated on Mar 24 2026 8:46 AM

ఇప్పటికే 3,098 మందికి రెండు విడతల్లో నోటీసులు జారీ

ఈ నెలాఖరులోగా ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని హుకుం

ఏప్రిల్‌ మొదటి వారం తర్వాతకొత్తవారికి కేటాయించే అవకాశం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొంది, వాటిలో నివసించని లబ్ధిదారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారులు ఇప్పటికే ఆయా నిర్మాణాల్లోని లబ్ధిదారులపై సర్వే చేశారు. అర్హులతో పాటు నకిలీలకు నోటీసులు జారీ చేశారు. అర్హులంతా ఈనెల 31లోగా ఆయా ఇళ్లలోకి వచ్చి చేరాలని, లేదంటే ఏప్రిల్‌ మొదటి వారం తర్వాత కేటాయింపులు రద్దు చేయాలని నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆయా నివాసాలను కేటాయించాలని భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు లేకపోవడంతో వారి కోసం జిల్లాలోని శంకర్‌పల్లి, తట్టి అన్నారం, బండరావిర్యాల, తిమ్మాయిగూడ, హత్తిగూడ, మన్సాన్‌పల్లి, నార్సింగి సహా మొత్తం పది ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. మూడేళ్ల క్రితమే జీహెచ్‌ఎంసీ అధికారుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆయా ఇళ్లను కేటాయించారు. ఇళ్లు పొందిన మెజార్టీ లబ్ధిదారులు ఇప్పటికీ గృహ ప్రవేశాలు చేయలేదు. గత నవంబర్‌లో 3,098 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. పట్టణానికి, పని ప్రదేశానికి ఈ నిర్మాణాలు దూరంగా ఉండటం, సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో మెజార్టీ లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.

చేతిలో పట్టా ఉన్నా..

అర్బన్‌ ప్రాంతాల్లోని నిర్మాణాల పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని నందనవనం, మీర్‌పేట, కుర్మల్‌గూడ, వనస్థలిపురం, నాగోలు వంటి ప్రాంతాల్లోని ఇళ్లను అనర్హులు ఆక్రమించేశారు. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఇతర ప్రాంతాల్లోని అర్హులను అడ్డుకుంటున్నారు. అనర్హులను ఖాళీ చేయించకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు సొంతింటికి దూరమయ్యారు. గత నవంబర్‌లో హౌసింగ్‌, రెవెన్యూ అధికారులు ఆయా ఇళ్లను తనిఖీ చేసి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఖాళీ చేయలేదు. కరెంట్‌ సరఫరా, మంచినీటి కనెక్షన్లు అధికారికంగా ఇవ్వకపోయినప్పటికీ .. సమీపంలోని విద్యుత్‌ వైర్ల నుంచి దొంగతనంగా విద్యుత్‌ను వాడుతున్నారు. మంచినీటి పైపులైన్లకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా నందనవనంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కళ్లముందే కరెంట్‌ చౌర్యం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. చేతిలో ప్రభుత్వం జారీ చేసిన ఇళ్ల మంజూరు పత్రం ఉన్నా ఇంట్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి.

ఖాళీగా ఉన్నవి కొత్తవాళ్లకు..

‘ఇళ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పకుండా నివసించాలి. లేదంటే ఏప్రిల్‌ మొదటి వారం తర్వాత రద్దు చేస్తాం. అంతేకాదు నిర్మాణం పూర్తై..ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులకు మార్చి 31లోగా కేటాయించాలి’ అని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ‘అధికారులు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్‌–2 జాబితాలోని పేదలను గుర్తించి, వారికి ఆయా ఖాళీ ఇళ్లను కేటాయించాలి. ఇందిరమ్మ కమిటీల సహాయంతో ఎంపిక చేసిన లిస్టును జిల్లా మంత్రి ఆమోదంతో గజిటెడ్‌ ఆఫీసర్‌ ద్వారా ధ్రువీకరణ చేసి మంజూరు చేయాలి. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొంది, గృహ ప్రవేశం చేయని వారిని గుర్తించి, వారికి మరోసారి నోటీసులు జారీ చేయాలి. అయినా ముందుకు రాని వారి పేర్లను ఏప్రిల్‌ మొదటి వారం తర్వాత రద్దు చేసి, వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలి’ అని ఆదేశించారు.

గృహ ప్రవేశం చేయని డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement