‘ఆశ’లకు ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఆశ’లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Mar 24 2026 8:46 AM | Updated on Mar 24 2026 8:46 AM

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సాయిబాబా

కొత్తూరు: ఆశవర్కర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీస సాయిబాబా డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో మండల మెడికల్‌ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశవర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28 చలో కమిషనరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కరోనా మొదలుకొని ప్రభుత్వం అమలుచేసే ప్రతీ పథకం విజయవంతం కావడంలో ఆశల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అలాంటి వారికి నేటికి కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడికి పాల్పడుతుందన్నారు. వెంటనే వారికి నెలకు రూ.18 వేల వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని పక్షంలో విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశలు మంజుల, కమల, అనిత, చైతన్య, శశిరేఖ, శ్రీవాణి, నవనీత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, అధ్యక్షుడు రుద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, ఐసీడీఎస్‌లకు సరిపడా నిధులు కేటాయించాలని, ఎన్‌ఐసీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అంసెబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. 2026 ఎడ్యుకేషన్‌ పాలసీని సవరించాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఒంటిపూట బడిని నిర్ణయించి, టీచర్స్‌, హెల్పర్స్‌ ఇద్దరికీ ఒకేసారి మే నెలంతా సెలవులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌, స్వప్న, జిల్లా నాయకులు చుక్క మోహన్‌, రాజ్యలక్ష్మి, నాగమణి, అనిత, రమణమ్మ, సౌభాగ్య, శశికళ, సంతోష, మమత, ప్రేమలత, భాగ్యలక్ష్మి, పాపమ్మ, జ్యోతి, శివలీల తదితరులు పాల్గొన్నారు.

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటీ

వ్యక్తికి గాయాలు

మొయినాబాద్‌: స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి కాలు విరిగింది. ఈ సంఘటన హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై మున్సిపల్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన అఫ్సర్‌ స్కూటీపై నగరం నుంచి మొయినాబాద్‌కు వస్తుండగా హిమాయత్‌నగర్‌ చౌరస్తా వద్దకు చేరుకోగానే స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతని కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్సకోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement