మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మోమిన్‌పేట: బోలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోమిన్‌పేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్ భూషణ్ కథనం మేరకు.. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన అజీం(30) తనతో పాటు అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుండోల్ల మల్లప్పతో కలిసి బోలెరో వాహనంలో జీవాలు వేసుకొని మోమిన్‌పేట మండలం సయ్యద్ అల్లీపూర్‌కు బయలుదేరాడు. మొరంగపల్లి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ ముస్తాఫా అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే చెట్టును ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో అజీం అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెల కాపరి మల్లప్ప, డ్రైవర్ ముస్తాఫాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి బావ ఫకృద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సీతారాముల విగ్రహ
ప్రతిష్ఠాపన ప్రారంభం
తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్‌లో పునర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో దేవతల విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. స్థానిక భద్రేశ్వర్ చౌక్‌లోని హనుమాన్ మందిరం నుంచి సీతారాముల విగ్రహాలను బాజాభజంత్రీలతో, భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం నవగ్రహ పూజ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠాపన, హోమ కార్యక్రమాల అనంతరం మూలవిరాట్లకు జలాధివాసం గావించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.


