ఆలూరు–1,2,3లో భూసేకరణకు నోటిఫికేషన్ 1,179 ఎకరాల్లో పరిగి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు తొలి నోటిఫికేషన్‌లో 159.25 ఎకరాల సేకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ నోటిఫికేషన్లు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఐటీ, ఇండస్ట్రియల్ జోన్ల పేరుతో ఇప్పటికే రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని భూములను సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఏపీలో ప్రతిపాదనల దశలో ఉన్న చేవెళ్ల ఆలూరు పారిశ్రామిక కారిడార్ అంశం తాజాగా మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. పారిశ్రామిక కారిడార్ సహా రేడియల్ రోడ్ల కోసం 1,248.22 ఎకరాలను సేకరించనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 1,179 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని భావించి, ఆ మేరకు తొలి నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్ భూములే లక్ష్యంగా ఈ నోటిఫికేషన్లు వెల్లడిస్తుండటంతో ఇప్పటి వరకు ఆ భూములపై ఆధారపడిన పేదలు రోడ్డున పడాల్సి వస్తోంది. సాగులో ఉన్న రైతులు ప్రభుత్వం 2016 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. రైతులు మాత్రం ఇందుకు ససేమిరా అంగీకరించడం లేదు.
రైతులు నిరాకరిస్తున్నా.. ముందుకే
ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కందుకూరు, కడ్తాల్, యాచారం మండలాల్లో 14 వేల ఎకరాలను సేకరించింది. మరో ఏడు వేల ఎకరాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫార్మాసిటీని రద్ధు చేసి, దాని స్థానంలో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, ఫ్యూచర్‌సిటీ, ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల పేరుతో ఇప్పటికే యాచారం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో భారీగా భూములను సేకరించింది. కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు సహా సర్వే నంబర్ 162లో 217 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో 195.5 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగా, కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ తొమ్మిది లోని 439 మంది రైతుల నుంచి 366.4 ఎకరాలు, మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాలు, యాచారం మండలంలోని 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాలు భూసేక రణకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కుర్మిద్ద, మర్లకుంటతండ, మొండిగౌరెల్లి తదితర గ్రామాల రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే తమ వద్ద ఉన్న అసైన్డ్ భూములన్నీ ఇచ్చేశాం. మిగిలిన కొద్ది పాటి పట్టాభూములను కూడా సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా గ్రామాల రైతులు వరుస ఆందోళనలు చేపడుతున్నారు. నాలుగైదు రోజులుగా రిలే దీక్షలు ప్రారంభించారు.
తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు
ఉమ్మడి జిల్లాలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భూ సేకరణ కోసం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏళ్ల క్రితమే ప్రతిపాదనల దశలో ఉన్న చేవెళ్ల మండలం ఆలూరు రెవెన్యూ పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కును తాజాగా తెరపైకి తెచ్చింది. 1248.22 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం.. ఆలూరు–1లో 52 సర్వే నంబర్ల నుంచి 510.8 ఎకరాలు, ఆలూరు–2లోని 35 సర్వే నంబర్ల నుంచి 380.38 ఎకరాలు, ఆలూరు–3లోని 31 సర్వే నంబర్ల నుంచి 357.16 ఎకరాల వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్ చేసింది. ఏళ్ల క్రితమే సమసిపోయిందనుకున్న అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఇప్పటి వరకు ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంగా 1,179 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని భావించి, ఆ మేరకు తొలి దశలో 159 ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడి రైతుల్లో కూడా ఆందోళన మొదలైంది. లగచర్ల ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే మరో పారిశ్రామికవాడ పేరుతో నోటిఫికేషన్ వెలువడటం ఆయా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
1248.22 ఎకరాలుసేకరించనున్నట్లు ప్రకటన


