‘ఫ్యూచర్‌’ కోసం.. | - | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్‌’ కోసం..

Mar 21 2026 6:39 AM | Updated on Mar 21 2026 6:39 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) సహా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ కింద మూసీ, ఈసీల సంగమంలో వివిధ అభివృద్ధి పనులు, కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్‌కు సైతం భారీగా నిధులు కేటాయించింది. మరుగున పడిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొంది. మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు సమకూర్చనుంది. దేశవిదేశీ కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనుంది. జిల్లా వాసులకు మరింత మెరుగైన, సత్వర వైద్యసేవలు అందించేందుకు ఈ ఏడాది చివరి నాటికి ఎల్బీనగర్‌ టిమ్స్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించి, ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన కోసం బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత కల్పించింది.

ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి..

యాచారం, కడ్తాల్‌, కందుకూరు మండలాల్లోని 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌సిటీ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ మౌలిక సదుపాయల కల్పన కోసం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించింది. రేడియల్‌ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్‌సిటీని నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్‌ లైన్లు, పర్యావరణ అనుకూల స్మార్ట్‌ గ్రిడ్లతో సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలువనుందని ప్రకటించింది.

స్కిల్‌ వర్సిటీకి రూ.30 కోట్లు

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.30 కోట్లు కేటాయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఐటీఐలను ఈ వర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి, విద్యార్థి దశలోనే పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్‌ను నేర్పించనుంది.

ప్రాణహిత–చేవెళ్లకు రూ.526 కోట్లు

గోదావరి నదిపై తుమ్మిహెట్టి వద్ద నిర్మించనున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.526 కోట్లు కేటాయించింది. బీఆర్‌ఎస్‌ హయాంలో మరుగున పడేసిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం 2026–27 వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించి మళ్లీ ఊపిరి పోసినట్లైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.1,800 కోట్లు కేటాయించింది. కానీ పథకంలో భాగంగా షాద్‌నగర్‌ నియోజకవర్గం జిల్లెడు చౌదరిగూడం మండలంలో 1,512 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతల పెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పేరును ప్రస్తావించ కపోవడం విస్మయం కలిగిస్తోంది. నారాయణపేట్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.1,101 కోట్లు కేటాయించి జిల్లాలోని ప్రాజెక్టుకు పెద్దపీట వేసింది. డిండి ఎత్తిపోతల పథకానికి రూ.600 కోట్లు కేటాయించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పంట పొలాలకు నీళ్లు అందించే శివన్నగూడం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చింది.

‘ఫ్యూచర్‌’ కమిషనరేట్‌కు రూ.250 కోట్లు

కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్‌ భవనానికి రూ.250 కోట్లు కేటాయించింది. పోలీసుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం మరో రూ.40 కోట్లు కేటాయించింది.

అభివృద్ధికి బాటలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేలా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ, నీటి పారుదల, రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో ప్రగతిశీల అభివృద్ధితో పాటు మహిళా సంక్షేమం, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల, మైనారిటీల అభ్యున్నతికి కేటాయింపులు హర్షణీయం.

– డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, మండలి చీఫ్‌ విప్‌

జిల్లాకు తీరని అన్యాయం

ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్‌. జిల్లాకు తీరని అన్యాయం చేసే విధంగా ఉంది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న జిల్లాకు ఆశించిన విధంగా నిధులు కేటాయించకపోవడం దారుణం. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది.

– బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు

విద్యకు అంతంతే..

బడ్జెట్‌లో విద్యకు జరిగిన కేటాయింపులు 8.2 శాతమే. వీటితో నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ప్రారంభం సాధ్యమవుతుందా..? అనేక గురుకులాలు ఇంకా ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత హెల్త్‌ కార్డ్స్‌ ప్రక్రియ సాఫీగా సాగడం లేదు.

– వై.కరుణాకర్‌ రెడ్డి, ఎస్‌టీయూటీఎస్‌ నాయకుడు

అంకెల గారడీ

బడ్జెట్‌ అంకెల గారడీని తలపించేలా ఉంది. క్షేత్ర స్థాయిలో సామాన్యుడికి చేరేది అత్యల్పం. ప్రజలను మభ్య పెడుతున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే అధికంగా ఉన్న బీసీలకు కేవలం 3.8 శాతం మాత్రమే కేటాయించారు. బీసీ సబ్‌ ప్లాన్‌ ఊసే లేదు. వ్యవసాయ రంగంలో గతేడాది కంటే కోత విధించడం అన్యాయం.

– ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు

ఎఫ్‌సీడీఏకు రూ.300 కోట్లు

పోలీసు కమిషనరేట్‌కు రూ.40 కోట్లు

రేడియల్‌రోడ్లు.. పారిశ్రామికవాడలకు ప్రత్యేక నిధులు

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రాధాన్యత

బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement