మంత్రులకు ఘన స్వాగతం
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిఽధిలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్రామ సమీపంలో గజమాల, బోనాలతో ఘనస్వాగతం పలికారు. మండల పరిధిలోని ఎలికట్ట ముఖ్యకూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుష్పగుచ్ఛాలు అందజేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
కేజీబీవీ సందర్శన
మొగిలిగిద్ద పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
వెలుగులు నింపిన దేవాలయం
ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానపు వెలుగులు నింపిన దేవాలయం మొగిలిగిద్ద విద్యాలయం అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్‌వంటి ఎందరో మేధావులు ఈ పాఠశాలలోనే చదువుకున్నారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లిని నిర్మిస్తే ఈ ప్రాంతం పచ్చని పొలాలతో సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సరిత, తహసీల్దారు నాగయ్య, సర్పంచ్ కృష్ణ, ఎంపీడీఓ బన్సీలాల్, ఎంఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో ఫొటో లేదంటూ..
మొగిలిగిద్ద పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గ్రామ సర్పంచ్ కృష్ణ (బీఆర్‌ఎస్) ఫొటో లేకపోవడంతో సర్పంచ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరుడి ఫొటో పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత అధికారులు ఫ్లెక్సీలో సర్పంచ్ ఫొటో ఏర్పాటు చేయడంతోశాంతించారు.


