బస్సు.. తుస్సు!
భద్రతలేని బడి బస్సులు
● ప్రహసనంగా మారిన ఫిట్‌నెస్ పరీక్షలు
● తరచూ వెలుగు చూస్తున్న ప్రమాదాలు
● పట్టించుకోని రవాణాశాఖ అధికారులు
● ఆందోళనలో తల్లిదండ్రులు
● ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా 60 మంది విద్యార్థులతో జలవిహార్ బయలు దేరిన ఓ స్కూల్ బస్సు డిసెంబర్ 25న శంషాబాద్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయపపడ్డారు.
● మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడవాంబే కాలనీ సమీపంలో ఓ కార్పొరేట్ స్కూలుకు చెందిన బస్సులో నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిపడ్డాయి. అదృష్టవశాత్తు విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
● రెండు రోజుల క్రితం మొయినాబాద్ నుంచి బండ్లగూడ జాగీర్‌కు తిరుగుముఖం పట్టిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బస్సు మృగవని పార్కు సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. 17 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
● ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, కొంగరలోనూ స్కూలు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో తరచూ ఏదో ఒక చోట స్కూలు, కాలేజీ బస్సులు అదుపుతప్పి పల్టీలు కొడుతూనే ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు గాయపడుతూనే ఉన్నారు. అయినా బస్సుల ఫిట్‌నెస్‌ను రవాణాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో హడావుడి చేయడం తప్ప ఆ తర్వాత వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. సామర్థ్య పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఏటా ఇటు విద్యాసంస్థలు, అటు రవాణాశాఖ ఒక ప్రహసనంగా మార్చాయి.
కాలం చెల్లినా.. యథేచ్ఛగా నడుపుతూ..
జిల్లాలో 1,300కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 1,700కు పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ఇక 17 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కాలేజీలు ఉండగా, మరో రెండు వందలకుపైగా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, బీఈడీ, పాలిటెక్నిక్, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తివిద్యాకాలేజీలు మరో 77 వరకు ఉన్నాయి. మెజార్టీ కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఓఆర్‌ఆర్‌కు అటు, ఇటుగా ఆనుకుని ఉన్నాయి. ఆయా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు స్వయంగా వాహనాలను సమకూర్చి, విద్యార్థులను ఇంటి నుంచి కాలేజీ వరకు, అటు నుంచి ఇంటి వరకు తరలిస్తున్నాయి. ఇందుకోసం పది వేల స్కూలు, కాలేజీ బస్సులు ఉన్నట్లు అంచనా. నిబంధనల మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. ఆ లెక్కన సుమారు వెయ్యికి పైగా కాలం చెల్లిన స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి. వాహనాల కండీషన్, కాలుష్యం, సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పదిహేనేళ్లు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికుల రవాణా కోసం వినియోగించరాదు. పిల్లల కోసం నడిపే వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏళ్లుగా కాలం చెల్లిన బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలో తక్కువ ధరల్లో పాత బస్సులను కొనుగోలు చేసి వాటిని ఇక్కడ స్కూల్ బస్సులుగా మార్చేస్తున్నారు. వాహనాల జీవితకాలన్ని ప్రామా ణికంగా తీసుకొని ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించాల్సిన మోటారు వాహన తనిఖీ అధికారులు పట్టించుకోకవడం లేదు.
ఇటీవల స్కూల్ బస్సులే కాకుండా రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లలో దూకుడు పెరిగింది. మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ పెద్ద బండ్లను నడుపుతున్నారు. స్కూల్ బస్సుల్లోనూ ఆ ప్రమాదకరమైన జాడ్యం కనిపిస్తోంది. బస్సుల కండీషన్‌తో పాటు అంత కంటే కీలకమైన డ్రైవర్లను కూడా జాగ్రత్తగా ఎంపిక చేయాలి.
● డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించకుండా ఉండాలి.
● పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి.
● యాజమాన్యం సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తపోటు, షుగరు, కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
● డ్రైవర్‌ను నియమించేందుకు ముందు అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్, తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి.
● డ్రైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి.
పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలా కండిషన్ బాగున్న వాహనాలు, అనుభవం ఉన్న డ్రైవర్లను మాత్రమే పిల్లల తరలింపు కోసం వినియోగించాలని ఉన్నత న్యాయస్థానాలు పదేపదే ఆదేశించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. ఫిట్‌నెస్ నిర్ధారణ కోసం ప్రతి బస్సు నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా స్కూల్ బస్సుల నిర్వహణ లోపభూయిష్టంగా మారుతోంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్నామనే విషయాన్ని విస్మరించి కొందరు డ్రైవర్‌లు ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్లపై బెంబేలెత్తిస్తున్నారు. చిన్నచిన్న కాలనీలు, గల్లీల్లో సైతం వేగంగా నడుపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో తరచూ ఏదో ఒకచోట ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి బస్సులో అటెండర్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన సైతం అమలు కావడం లేదు.
మొయినాబాద్: మృగవని పార్కు వద్ద బుధవారం బోల్తా పడ్డ స్కూల్ బస్సు


