న్యాయం చేసి భూమి తీసుకోండి
● స్పష్టం చేసిన బాధిత రైతులు
● రావిర్యాలలో భూ సేకరణ గ్రామసభ
తుక్కుగూడ: అన్ని విధాలా తమకు న్యాయం జరిగిన తర్వాతే భూములు తీసుకోవాలని బాధిత రైతులు స్పష్టం చేశారు. రావిర్యాల కొంగర ఖుర్దు–ఏ రెవెన్యూ, అసైన్డ్ భూమిలో ఐటీ పార్క్ కోసం 153 మంది రైతుల నుంచి ప్రభుత్వం 277 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గురువారం బాధిత రైతులతో రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ముందుగా అధికారులు భూములు కోల్పోతున్న రైతుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. నిరుపేదలమైన తమకు ప్రభుత్వం ఉపాధి కోసం అసైన్డ్ భూమిని పంపిణీ చేసిందని అన్నారు. వందళ్ల ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్టు తెలిపారు. ఇప్పుడు కంపెనీల పేరుతో భూములు తీసుకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.3 కోట్ల నష్టపరిహారంతో పాటు, 500 గజాల ఇంటి స్థలం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే న్యాయ స్థానాలను ఆశ్రయించి, హక్కులు సాధించుకుంటామన్నారు. రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, టీజీఐఐసీ అధికారులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.


