నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఇబ్రహీంపట్నం: చాలామంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటున్నారే తప్ప, దానికి తగ్గట్టు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ.ఇటికాల పురుషోత్తం అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా పరివర్తన, సాధికారత వైపు ఒక చొరవ అంశంపై ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచీకరణకు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే వారు అపారమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారని తెలిపారు. విధానాలను తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని, దాన్ని అమలు చేయడం అధికారులు, సంస్థల బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎర్త్ యూనివర్సిటీతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ రాధిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాలల జాయింట్ డైరెక్టర్ బాలభాస్కర్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొ.ఇంద్రకాంత్, సదస్సు కన్వీనర్ డా. రమేష్, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డా. డీఎస్‌ఎస్‌ఆర్ కృష్ణ, కో కన్వీనర్ రవికుమార్, విధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం


