ఓంకారేశ్వరాలయ భూములు సేకరించొద్దు
● ఫ్యూచర్‌సిటీ పేరిట కౌలు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూ ములను ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు తీసుకోవద్దని, సాగులో ఉన్న కౌలు రైతులకు హక్కులు కల్పించి, పట్టాదారు, పాసుపుస్తకాలు జారీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నందివనపర్తి గ్రా మంలోని 1,400 ఎకరాల ఓంకారేశ్వరాలయ భూ మిని తాడిపర్తి, నందివనపర్తి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద రైతులు ఏళ్ల నుంచి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కౌలు రైతులకు 37 ఏ సర్టిఫికెట్లు సైతం ఇచ్చారని.. 38 ఈ టెనెంట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఆ భూముల్లో రైతుల సాగుకు రూ.లక్షలాదిగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసుకున్నారని అన్నారు. నేడు ఆ భూములను ఫ్యూచర్‌సిటీ కోసం తీసుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.
27న జాన్‌వెస్లీ రాక
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఈ నెల 27న ఓంకారేశ్వరాలయ భూములను సందర్శిస్తారని పి.యాదయ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ భూములను సందర్శించి కౌలు రైతులతో మాట్లాడుతారని చెప్పారు. కౌలు రైతులకు న్యాయం చేయడం కోసం సీపీఎం మరో పోరాటానికి సిద్ధమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు పి.అంజయ్య, మండల నాయకులు జంగయ్య, తావునాయక్, వెంకటయ్య, జగన్, బాల్‌రాజ్, లాజర్, మౌనిక, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


