పట్టణాల అభివృద్ధి స్థిరంగా జరగాలి
మొయినాబాద్: తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ విజన్–2047 ఆశయాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి స్థిరంగా జరగాలని.. పట్టణాల అభివృద్ధిని కేవలం మౌలిక సదుపాయాలు, విస్తరణ, ఆర్థికవృద్ధితో మాత్రమే కాకుండా మానవ సంక్షేమం, పర్యావరణ సమతుల్యత, సామాజిక సమానత్వం, సాంస్కృతిక నిరంతరత, ధీర్ఘకాలిక స్థిరత్వం వంటి అశాలతో కొలవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) ఆధ్వర్యంలో పట్టణీకరణ, స్థిరత్వంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, పట్టణ నిపుణులు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళికకారులు, పర్యావరణ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల నాయకులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పౌర ప్రతినిధులు పాల్గొని పట్టణీకరణ అభివృద్ధి, పట్టణాల సవాళ్లు–వాస్తవ పరిస్థితి, వాతావరణ మార్పు–తక్షణ అవసరం, భవిష్యత్ అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి కోసం స్థిరమైన, సమానత్వంతో కూడిన పట్టణాలను రూపుదిద్దే దిశగా పనిచేయాలని.. అందుకు సామూహిక అవగాహణ అవసరమని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సదస్సు పాలనకు మార్గనిర్దేశం చేసే, ప్రజాజీవితాన్ని బలోపేతం చేసే పరిష్కారోన్నత వేదికగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. సదస్సులో ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధిపతి సుజనారెడ్డి కుంభం, మహేంద్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిర్బన్ ఘోష్, పర్యావరణ నిపుణులు బీవీ సుబ్బారావు, ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీ ప్రతినిధి అరుణ్‌కుమార్, ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధి కవితారెడ్డి, రాంకీ గ్రూప్ ప్రతినిధి శ్రీనివాస్ కేశవరపు, గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ సందర్శన
కొందుర్గు: హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తహసీల్దార్ అజాంఅలీ సూచించారు. శనివారం పులుసుమామిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని కిచెన్ షెడ్, కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. తాజా కూరగాయలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి నిస్సీ శేకీనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


