ఎకరాకు రూ.కోటి చెల్లించండి
ఆమనగల్లు: గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న సాకిబండతండా గిరిజనులకు ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని ఆ తండాకు చెందిన పలువురు రైతులు కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని రైతులు పత్యానాయక్, రవిరాథోడ్, బాలునాయక్, మణిపాల్‌నాయక్, శంకర్‌నాయక్, పాండునాయక్, ఇంద్రారెడ్డి, విజేందర్, గణేశ్ తదితరులు కలిసి వినతిపత్రం అందించారు. ఎకరాకు రూ.కోటి పరిహారంతో పాటు ఫ్యూచర్‌సిటీలో 500 గజాల నివాసస్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు
తొలగించిన రెవెన్యూ అధికారులు
శంకర్‌పల్లి: ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శంకర్‌పల్లి రెవెన్యూ అధికారులు జేసీబీల సాయంతో సోమవారం కూల్చివేశారు. తహసీల్దార్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జన్వాడలో గల సర్వే నంబర్ 192లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా నాలుగు నిర్మాణాలను చేపట్టారు. దీనిపై ఇప్పటికే పలువురు తహసీల్దార్‌కి ఫిర్యాదు చేయగా.. సిబ్బందిని పంపి, విచారణ చేయించారు. అక్రమ నిర్మాణాలు నిజమేనని గుర్తించి, సోమవారం జేసీబీల సాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, కట్టడాలు జరపడం నేరమని, ఎవరైనా అతిక్రమిసే్‌త్ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సురేందర్ హెచ్చరించారు.
ఉద్యమ కేసులు ఎత్తివేయాలి
చీఫ్ సెక్రటరీకి పీసీబీ సభ్యుడి వినతి
చేవెళ్ల: గత ప్రభుత్వ హయాంలో చేవెళ్ల జిల్లా ఏర్పాటుకోసం పార్టీలకు అతీతంగా నాయకులు, యువకులు, రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును కోరారు. సోమవారం నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింపుల మాట్లాడుతూ.. 2016లో జిల్లాల విభజన సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ కేంద్రంగా ఉన్న చేవెళ్లను కూడా జిల్లా చేయాలనే డిమాండ్‌తో పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు ఏకమై ఉద్యమించారని అన్నారు. శాంతియుతంగా జరిగిన నిరసన కార్యక్రమాలపై పోలీసులు దాదాపు 300 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న అమాయకులు కోర్టు విచారణలు, పోలీసు సమన్లను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కనకమామిడి ఆలయంలో చోరీ
రూ.1.15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తస్కరణ
మొయినాబాద్‌రూరల్: గర్భగుడిలో ఉన్న ఆభరణాలతో పాటు హుండీ పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పక్కనే ఉన్న మల్లన్న దేవాలయం, చౌరస్తాలోని అయ్యప్ప దేవాలయంలో ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కనకమామిడి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి బంగారు ఆభరణాలతో పాటు రెండు హుండీల్లో ఉన్న సుమారు రూ.1.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మల్లన్న దేవాలయంలోనూ హుండీ పగులగొట్టి నగదు తస్కరించారు. అయ్యప్ప దేవాలయంలోనూ దోపిడీకి యత్నించి వెనుదిరిగారు. చోరీ దృశ్యాలు సీసీ పుటేజీల్లో రికార్డయ్యాయి. కాగా దొంగలను పట్టుకొని సొమ్మును రికవరీ చేయాలని కనకమామిడి వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఎకరాకు రూ.కోటి చెల్లించండి
ఎకరాకు రూ.కోటి చెల్లించండి
ఎకరాకు రూ.కోటి చెల్లించండి


