గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్ బిస్మిల్లా కాలనీకి చెందిన నసీమా బేగం(54) గతేడాది ఆగస్టు 24న కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో, ఆమె కుమారుడు జావిద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
ఒకరి మృతి
పహాడీషరీఫ్: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురా ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా హుస్సేనీ(52) సోమవారం మధ్యాహ్నం పహాడీషరీఫ్‌లో నివాసం ఉండే తన సోదరి ఇంటికి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో పహాడీషరీఫ్ వై జంక్షన్ వద్దకు రాగానే బైపాస్ రోడ్డు నుంచి వేగంగా వచ్చిన కల్వకుర్తి డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఎస్సై ఫైసల్ అహ్మద్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన హుస్సేన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ జంక్షన్ వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేని కారణంగా అమాయకుల ప్రాణాలు పోవడం పరిపాటిగా మారింది.


