జింక మాంసం కేసులో వెలుగులోకి కొత్త విషయం
రాజేంద్రనగర్: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన జింక మాంసం కేసు విచారణలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కామాటిపురాకు చెందిన మహ్మద్ అబ్బు హుస్సేన్ కొన్ని రోజులుగా జింక మాంసాన్ని తీసుకొచ్చి చికెన్ సెంటర్ నిర్వాహకుడైన మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌కు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం హుస్సేన్ పరారీలో ఉన్నాడని రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారి టి.వీరేశం వెల్లడించారు. గగన్‌పహాడ్‌లోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ..పట్టుబడిన జింక మాంసం కృష్ణజింకగా నిర్ధారించామన్నారు. కొన్ని రోజులుగా కామాటిపురాకు చెందిన హుస్సేన్ జింక మాంసాన్ని తీసుకొచ్చి ఇర్ఫాన్‌కు అందిస్తున్నాడన్నారు. ఇర్ఫాన్ తన చికెన్ సెంటర్‌లో కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. అటవీ శాఖ చట్టం 1972 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువులను చంపినా వాటి మాంసాన్ని తిన్న, విక్రయించిన నేరమన్నారు. ఈ కేసుల్లో నిందితులకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా ఉంటుందన్నారు.


