బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
యువకుడు దుర్మరణం
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ సమీపంలోని తాజ్ హోటల్ ఎదుట బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌కు చెందిన బక్కారెడ్డి రఘునాథ్‌రెడ్డి(23) తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. సాయంత్రం 3.20 గంటల సమయంలో తన బైక్‌పై మొయినాబాద్ నుంచి చేవెళ్ల వైపు ప్రయాణిస్తుంగా తాజ్ హోటల్ ఎదుట ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం(లారీ), బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ అతని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మల్కాపూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.


