అంబేడ్కర్ మార్గం అనుసరణీయం
మహేశ్వరం: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన బాటలో పయనించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సిరిగిరిపురంలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, కేవలం జ్ఞానంతో సాధించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హయాంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టారని, 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. అంతకు ముందు గ్రామంలో అంబేడ్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు, మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ నాగరాణి, బీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, అంబేడ్కర్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి


