గంజాయి విక్రేతల అరెస్ట్
● ఇద్దరికి రిమాండ్
● పరారీలో మరో వ్యక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి టీసీఎస్ సమీపంలోని కార్మికులకు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కేంద్ర పారా జిల్లాకు చెందిన విజయ్‌శెట్టి (26), మృత్యుంజయ్ నాయక్ (21) ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. వీరు గంజాయి తీసుకువచ్చి ఆదిబట్లలోని టీసీఎస్ సమీపంలో ఉన్న కూలీలకు విక్రయిస్తుంటారు. నిందితులిద్దరూ ప్లంబర్ పనులు చేస్తుంటారు. ఒడిశాలోని అరఖిత్ అనే వ్యక్తి నుంచి చిన్నచిన్న ప్లాస్టిక్ కవర్లలో గంజాయి తెచ్చి, సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందడంతో విజయ్‌శెట్టి, మృత్యంజయ్‌నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరఖిత్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 24 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామని సీఐ రవికుమార్, ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
గంజాయి సేవిస్తున్న నలుగురికి రిమాండ్
కందుకూరు: గంజాయి మత్తులో తూగుతున్న నలుగురు బీహారీలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కందుకూరు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. కందుకూరు చౌరస్తా హీరోహోండా షోరూం పక్కన ఉన్న గదిలో గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దీంతో ఆగదిలో 400 గ్రాముల గంజాయి లభ్యమైంది. బీహార్ రాష్ట్రం భగల్‌పూర్ జిల్లా పిర్‌పింటికి చెందిన మహ్మద్ చోటు(20), షేక్ రాజు(46), మహ్మద్ ఆలమ్(36), మహ్మద్ రేహాన్(20) గంజాయి మత్తులో ఉన్నారు. వీరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీరంతా స్థానికంగా మేస్త్రీలు, కూలీలుగా పని చేస్తున్నారు. ఎస్‌ఐ పరమేశ్ కేసు దర్యాప్తు చేపట్టారు.
గంజాయి విక్రేతల అరెస్ట్


