బకాయిలు చెల్లించాలని ఆశ వర్కర్ల ఆందోళన
రాజేంద్రనగర్: లెప్రసీ సర్వేలో పాల్గొన్న ఆశా వర్కర్లకు బకాయిలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జాజాల రుద్ర కుమార్ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న ఆశా వర్కర్లు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించకుండా మళ్లీ సర్వే కొనసాగించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. చేసిన పనికి పారితోషకం చెల్లిస్తేనే అదనపు పని కొనసాగిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా డ్యూటీలు నిర్వహిస్తే ఇంతవరకు డబ్బులు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని... ఈ నెలలో మూడు దఫాలుగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తే ఇప్పటి వరకు ఒక రూపాయి చెల్లించలేదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జె.పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు బి.సాయిబాబా, శ్రీనివాస్, శేఖర్, మోహన్, స్వప్న, లత, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు రాధిక, లత, మంజుల, ఆండాలు, ఐలమ్మ పాల్గొన్నారు.


