వీబీ– జీ రామ్ జీ బిల్లు రద్దుకు డిమాండ్
కొందుర్గు: ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ– జీ రామ్ జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్(టీవీవీయూ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ప్రభుదాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సంఘం ఆధ్వర్యంలో కొందుర్గు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆజంఅలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ– జీ రామ్ జీ చట్టం అమలులోకి వస్తే ఉపాధి కూలీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తికి ఒక జాబ్ కార్డ్ అందించి పనిదినాలను పెంచాలని కోరారు. రోజుకు రూ.920 కనీస వేతనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, నాయకులు సిద్దు, శ్రీనివాసులు, అశోక్, కుమార్, వినోద, నర్సమ్మ, భారతమ్మ, సువర్ణ, నర్సింలు, జంగయ్య, రామయ్య, చంద్రయ్య, కవిత పాల్గొన్నారు.


