విద్యా సదస్సును జయప్రదం చేయండి
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య
షాద్‌నగర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి విద్యా సదస్సను విజయవంతం చేయాలని శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు వెంకటయ్య, నర్సింలు శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో ప్రభు త్వ విద్యారంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యారంగం యాజమాన్యాలు కోట్ల రూపాయల వ్యాపారంచేస్తూ విద్యారంగంలో అసమానతలను పెంచుతున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంకోసం ఈ రాష్ట్ర సదస్సులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తామన్నా రు. రాష్ట్ర స్థాయి విద్యాసదస్సుకు డివిజన్‌లోని ఉపాద్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్పెంటర్ అదృశ్యం
మీర్‌పేట: ఇంటినుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. గుర్రంగూడలో నివసించే నందిగామ సుదర్శన్‌చారి (60) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం పని నిమిత్తం బయటకు వెళ్లి వేరొకరి ఫోన్ నుంచి కుమారుడికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఎంతకూ రాకపోగా, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుమారుడు సాయి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
ఆమనగల్లు: పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి మహా పడిపూజనను వైభవంగా నిర్వహించారు. అఖిలభారతీయ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకుడు రాజ్‌దేశ్‌పాండే గురుస్వామి నేతృత్వంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజను నిర్వహించారు. ఈ పడిపూజలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.


