వృద్ధురాలి మృతి
ఆలస్యంగా వెలుగులోకి
బషీరాబాద్: ఓ ఇంట్లో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని పర్వత్‌పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంకుల లక్ష్మమ్మ(66) ఒంటరిగా ఉంటోంది. కొడుకు కాశప్ప కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నంలో స్థిరపడ్డారు. కూతురు నర్సమ్మ తాండూరులో ఉంటోంది. వీరు అప్పుడప్పుడు తల్లిని చూసేందుకు వచ్చి వెళ్తుంటారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూశారు. ఆమె శరీరం ఉబ్బి, కుళ్లిపోయి ఉండటంతో మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని భావించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు గ్రామానికి చేరుకొని విలపించారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. అస్తమా లేదా చలి తీవ్రతతో చనిపోయి ఉంటుందని స్థానికులు తెలిపారు.
హాష్ ఆయిల్ పట్టివేత, ఒకరి అరెస్టు
ఆమనగల్లు: ఆర్టీసీ బస్టాండ్‌లో హాష్ ఆయిల్ పట్టుబడింది. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరం నుంచి ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు గంజాయి తీసుకు వస్తున్నాడన్న సమాచారంతో బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు దిగిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని బ్యాగులో తనిఖీచేయగా నిషేధిత గంజాయితో తయారు చేసిన 600 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ తరలిస్తున్న వ్యక్తి నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ గ్రామానికి చెందిన ఆలకుంట దేశ్‌మంత్ అలియాస్ జశ్వంత్‌గా గుర్తించారు. నిందితున్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


