పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
● ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు
● మృతులిద్దరూ
బిహార్ రాష్ట్రానికి చెందిన వారు
కొత్తూరు: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్‌దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. నవనీత్‌దత్త ఐఓసీఎల్ ప్లాంట్‌లో డ్రైవర్‌గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ధనుంజయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్‌కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..


