
విధుల్లో అలసత్వం వద్దు
శంకర్‌పల్లి: విధుల్లో అలసత్వం వహించకుండా, ప్రభుత్వం సూచించిన పనులను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్ అన్నారు. మండలంలోని కొండకల్, మహారాజ్‌పేట్, దొంతాన్‌పల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పశువులకు వచ్చే వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన వైద్యం అందించాలన్నారు. పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహారాజ్‌పేట్ పశువైద్యురాలు డాక్టర్ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.
హయత్‌నగర్: మానవుడు తన అవసరాలకు సహజ వనరులను విధ్వంసం చేస్తున్నాడని, ప్రకృతి సహజత్వాన్ని కాపాడి భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ పర్యావరణవేత్త పాలడుగు జ్ఞానేశ్వర్ అన్నారు. హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవులను కొల్లగొటి, సహజ నీటి వనరులను కలుషితం చేయడంతో మంచినీటిని కొనుక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో గాలిని కూడా కొనాల్సిన దుస్థితి రావచ్చన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వృక్ష సంబంధమైన వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, నక్క శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
హయత్‌నగర్: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరఢా ఝులిపించారు. అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం తొర్రూర్ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 383లోని ప్రభుత్వ భూమిలో కొంత కాలంగా అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది ఆర్‌ఐ ప్రేమ్ ఆధ్వర్యంలో శుక్రవారం జేసీబీల సాయంతో వాటిని కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు.
కడ్తాల్: విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీని శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ తదితర విభాగాలను పరిశీలించారు. విద్యార్థినుతో మాట్లాడి విద్యా ప్రగతి, సౌకర్యాలను తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బోధనా విధానాలు, హాజరు, పాఠ్య ప్రణాళిక అమలు, విద్యార్థుల వ్యక్తిగత దృష్టి, నైపుణ్యాభివృద్ధిపై సమీక్షించారు. ఉపాధ్యాయుల కృషి, నిబద్ధతను ప్రశంసిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా బోధన కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేశ్, పాఠశాల ఎస్‌ఓ అనిత తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో అలసత్వం వద్దు