
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
తుక్కుగూడ: ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఎవరైనా విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండండి
మొయినాబాద్: వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి లలితాదేవి అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. లేబర్ రూం, ఫార్మసీ స్టోర్, ల్యాబ్ రూంలను పరిశీలించారు. గర్భిణుల స్కానింగ్‌లో గ్రోథింగ్ ఎలా ఉంది.. ఫార్మసీ స్టోర్‌లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా.. ల్యాబ్‌లో ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తున్నారనే విషయాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. మండల వైద్యాధికారి అన్నపూర్ణ, సీహెచ్‌ఓ వెంకట్‌రెడ్డితో మాట్లాడి ఆస్పత్రి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి సమస్య ఏమిటో తెలుసుకుని సరైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమయపాలన పాటించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శంకర్‌పల్లి పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ
శంకర్‌పల్లి: వైద్య సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరు కావడంపై జిల్లా వైద్యాధికారి లలితాదేవి అసహనం వ్యక్తం చేశారు. శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సకాలంలో హాజరు కాని వైద్యాధికారి రేవతిరెడ్డి, సీహెచ్‌ఓ స్వామి, ఫార్మసిస్టు నీరజ, స్టాఫ్ నర్సు అనిత, సూపర్‌వైజర్ అగ్నేస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి, హాజరు పట్టికలో సెలవులో ఉన్నట్లు సంతకం చేశారు. పీహెచ్‌సీ లోపల, బయట పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి