
పారదర్శకంగా డీసీసీ ఎన్నిక
రిజర్వేషన్లు సాధించే వరకు రిజర్వేషన్ల సాధనే తమ లక్ష్యమని, అమలు చేసేవరకు పోరాడతామని బీసీ జేఏసీ నాయకులు అన్నారు.
ఆమనగల్లు: రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు, తిరునళ్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అభిప్రాయ సేకరణ కోసం బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ బ్రూస్ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ ద్వారా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్య యుతంగా చేపడుతున్నట్టు చెప్పారు. సమర్థత, క్రమశిక్షణ, నిబద్ధత, పార్టీకోసం పనిచేసేవారికే అధ్యక్ష పదవి వస్తుందన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంటుందని, రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగుతారని అన్నారు. సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అద్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు శివసుబ్రహ్మణ్యం, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్ యాటగీత, బంజార రాష్ట్ర నాయకురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీకి అయిల శ్రీనివాస్‌గౌడ్ దరఖాస్తు
డీసీసీ అధ్యక్ష పదవికి కడ్తాల మండలం మైసిగండికి చెందిన టీపీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. మండల కేంద్రానికి శుక్రవారం వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు, ఎంపీ రాబర్ట్ బ్రూస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీయూఎస్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డిని దరఖాస్తు అందించారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నానని తెలిపారు. తనకు అవకాశం కల్పించాలని కోరారు.
ఏఐసీసీ పరిశీలకుడు, ఎంపీ రాబర్ట్ బ్రూస్