
రోడ్డు విస్తరణ పరిశీలన
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం టౌన్‌లోని ప్రధాన రోడ్డును ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శుక్రవారం పరిశీలించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఆక్టోపస్ మీదుగా సుమారు రూ.60 కోట్ల హెచ్‌ఆర్‌డీసీఎల్ నిధులతో విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్డు విస్తరణలో ప్రజలు నష్టపోకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, నష్టపోయే వారిని ఎలా ఆదుకోవాలి తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా ఉన్నవారికి నష్టం వాటిల్లకుండా అధికారులు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో నష్టపోతే స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనుల మ్యాప్‌ను ఆర్‌అండ్ బీ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రోడ్డు విస్తరణ, ప్రభుత్వాస్పత్రి నూతన భవన నిర్మాణం తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమావేశమై చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ సునితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.