
నో సేఫ్టీ..!
అనుమతులు లేకుండానే బోటింగ్ తరచూ మునిగిపోతున్న పడవలు గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇటీవల ఇద్దరి మృత్యువాత చోద్యం చూస్తున్న ఆయా శాఖలు
రిసార్ట్స్‌లో పర్యాటకులకు రక్షణ కరువు
వికారాబాద్: జిల్లాలో అనుమతులు లేని రిసార్ట్స్ విచ్ఛలవడిగా పుట్టుకొస్తున్నాయి. వీటిలో పర్యాటకుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాలం చెల్లిన బోట్లలో పర్యాటకులను ప్రాజెక్టుల్లోకి తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడేస్తున్నారు. ఇటీవల కాలంలో బోట్లు తిరగడబడి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.. అయినా అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. వికారాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ప్రైవేట్ రిసార్ట్స్ నిర్వాహకులు బోటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల బోటు తిరగబడి ఇద్దరు పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సంబంధిత శాఖల అధికారులపై తీవ్ర విమర్శలు రావడంతో రిసార్ట్స్‌ను మూసి వేశారు. ఆ వెంటనే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలతో విచారణ కమిటీ వేశారు. కమిటీ అక్కడ పర్యటించి నివేదిక కూడా ఇచ్చింది. కానీ అందులోని అంశాలను బయటపెట్టలేదు. అనుమతులు లేకపోవటంతో పాటు రిసార్ట్స్ నిర్వాహకుల తప్పిదం వల్లే పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలిసినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. కమిటీ నివేదిక సమర్పించి నెలలు కావస్తున్నా నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఇద్దరిని రిమాండ్ చేయగా ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అసైన్డ్ భూమిలో, ప్రాజెక్టు బఫర్ జోన్‌లో, పశువుల తాగునీటి పానాదిలో నిర్మాణాలు వెలసాయి. అయినా రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
వరుస ఘటనలతో బెంబేలు
రిసార్ట్స్ నిర్వాహకులు సమీప ప్రాజెక్టుల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బోటింగ్ నిర్వహిస్తున్నారు. కాలం చెల్లిన పడవలు కావడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అందులో వెళ్లే పర్యాటకులకు సేఫ్టీ మెజర్ మెంట్స్ ఇవ్వకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల వికారాబా ద్ సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. మునిగిపోతున్ను మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఇది మూడో ప్రమాదం. ఇక్కడి ఓ రిసార్ట్స్‌లో గతంలో అడ్వెంచర్ గేమ్స్ ఆడుతూ బావిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల ఇద్దరు పర్యాటకుల మృతికి కారణమైన రిసార్ట్స్‌లోనే అడ్వెంచర్ గేమ్‌లో భాగంగా కారు నడుపుతూ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే రిసార్ట్స్‌ల ఏర్పాటుకు 11 రకాల అనుమతులు అవసరం ఉండగా అందులో ఏ ఒక్కటి కూడా తీసుకోవడం లేదు. కోట్‌పల్లి ప్రాజెక్టు, సర్పన్‌పల్లి ప్రాజెక్టు పరిసరాలు, ఆ ప్రాజెక్టుల బఫర్ జోన్లు పూర్తిగా ఈ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు.
చేయి తడిపితే సక్రమం
జిల్లాలోని కొంత మంది అధికారులు రిసార్ట్స్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అక్రమం.. చేయి తడిపితే సక్రమం అనే ధోరణి అవలంబిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతగిరి ఫారెస్టుకు అనుకొని అక్రమంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ విషయంలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి అనుమతులు లేవని మూసి వేశారు. నెల తిరక్కుండానే మళ్లీ ఓపెన్ చేశారు. ఏడాది క్రితం కూడా ఇలాగే జరిగింది. కానీ అధికారులు పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలతో ఈ రిసార్ట్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు కూడా దాని నిర్వహణకు ఓ ప్రజాప్రతినిధి సహకరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఇందులో బోటింగ్, నైట్ క్యాపింగ్, పలు రకాల అడ్వెంచర్ గేమ్స్, గేమింగ్, హోటల్స్, రాత్రి బస చేసేందుకు గదుల ఏర్పాటు చేశారు. పేకాట, మద్యం సేవించడం వంటివి సాధరమైపోయాయి. ఒక్క రాత్రి బస చేసేందుకు అక్కడ కల్పించే సౌకర్యాలు, అడ్వెంచర్ గేమ్స్‌ను బట్టి ఒక్కో జంటకు రూ.3000 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు.