
రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం
● బీసీలంతా సంఘటితంగా ముందుకు సాగాలి
● సంఘం జేఏసీ నాయకులు
ఆమనగల్లు: రిజర్వేషన్ల సాధనే తమ లక్ష్యమని, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా అమలు చేసేవరకు.. పోరాడతామని బీసీ జేఏసీ ఆమనగల్లు నాయకులు అన్నారు. అందుకు రాజకీయాలకు అతీతంగా బీసీలు సంఘటితంగా ముందుకు సాగాలని, రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని రాజకీయ శతృవులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. పట్టణంలోని హనుమాన్ ఆలయంలో శుక్రవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల అమలుకు కార్యాచరణ, నేడు నిర్వహించే తెలంగాణ బంద్ విజయవంతంపై చర్చించారు. అనంతరం పలువురు మాట్లాడారు. పోరాటాలతోనే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించి, రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీల అభ్యున్నతిని కాంక్షించి, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలని, దానిని అడ్డుకున్న వారు ఎంతటివారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. నేటి బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు అల్లాజీగౌడ్, శివలింగం, కేశవులు, బాలకృష్ణ, శ్రీను, జి.శ్రీను, దుర్గయ్య, ప్రసాద్, అప్పి, పరమేశ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ మద్ధతు
కడ్తాల్: రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్‌కు పూర్తిగా సహకరిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.