
ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్లిన వ్యక్తి అదృశ్యం
శంషాబాద్ రూరల్: అప్పులు తీర్చే మార్గలేక.. కొడుకు చదువుకోవడానికి హాస్టల్‌కు వెళ్లనంటూ మారాం చేయడంతో మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... పిల్లోనిగూడకు చెందిన పానుగంటి శ్రీనివాస్(40) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇతని కొడుకు కిశోర్ దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న శ్రీనివాస్ తిరిగి హాస్టల్‌కు కొడుకును తీసుకుని వెళ్లగా.. అక్కడ ఉండనంటూ కిశోర్ ఏడ్వడంతో ఇంటికి తీసుకొచ్చాడు. సోదరుల వద్ద తీసుకున్న అప్పు కట్టడానికి డబ్బులు లేవంటూ.. కొడుకు హాస్టల్‌లో ఉండటం లేదనే బాధతో శ్రీనివాస్ అదే రోజు రాత్రి బాధ పడ్డాడు. తాను చనిపోతానని ఇంట్లో తాడు తీసుకుని పొలానికి బయలుదేరాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వారించినా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.