
కేసీఆర్ పాయే.. భగీరథ నీళ్లు పోయే!
● మాజీ మంత్రి సబితారెడ్డి ఆవేదన
● ఆడబిడ్డలకు మళ్లీ నీటికష్టాలు వచ్చాయని అసహనం
చేవెళ్ల: ‘కేసీఆర్ పాయే.. భగీరథ నీళ్లు పోయే.. గ్రామాల్లో చిన్నపిల్లలకు ఏమిటి ఈబాధ’ అని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. దివంగత నాయకుడు ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా శనివారం కౌకుంట్లకు వెళ్తున్న ఆమె అంతారంలో రోడ్డు పక్కన బిందెల్లో నీళ్లు పడుతున్న ఇద్దరు చిన్నారులను చూసి వాహనం ఆపారు. ఇంట్లో నల్లా నీళ్లు రావటం లేదా..? ఇక్కడ ఎందుకు పడుతున్నారని ప్రశ్నించగా.. నీళ్లు రావడం లేదని బాలుడు బదులిచ్చాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడగగా.. పనికి పోయిందని చెప్పాడు. అనంతరం అక్కడే ఉన్న గ్రామస్తులను పలకరించిన సబితారెడ్డి నల్లా నీళ్లు రావడం లేదా అని అడిగారు. వారం రోజులుగా భగీరథ నీళ్లు రావడం లేదని, ఓ వ్యవసాయ బావి మోటారు నుంచి నల్లా పైపు కనెక్షన్ తీసుకుని వాడుకుంటున్నామని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన ఆమె కేసీఆర్ దిగిపోవడంతో ఆడబిడ్డలు, చిన్నారులకు మళ్లీ నీటి కష్టాలు వచ్చాయని, కాంగ్రెస్ పాలనలో పాత రోజులను గుర్తుకు తెస్తోందన్నారు.