
అలయ్.. బలయ్.. రుచులు అదిరాయ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం జరిగిన అలయ్ బలయ్ ఆద్యంతం ఆకట్టుకుంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో వేదిక చూడముచ్చటగా కనిపించింది. అలాగే.. అతిథులకు సుమారు 80 రకాలకు పైగా వంటకాలను వడ్డించారు. తెలంగాణ సంప్రదాయల రుచులు ఎంతగానో నోరూరించాయి. సుమారు 12వేల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు చికెన్, మటన్ బిర్యానీ, భగారా, బోటీ, తలకాయ, చేపల ఇగురు, బొమ్మిడాల పులుసు, రొయ్యలు, తదితర మాంసాహారాలు కర్రీ, ఫ్రై, రకాలు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు చపాతీలు, వడలు, జొన్నరొట్టెలు, రుమాల్ రోటీ వంటి డైట్ ఫుడ్, తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న డబుల్‌కా మీఠాతో పాటు వివిధ రకాల స్వీట్స్‌ను తయారు చేయించారు. తెలంగాణలో గుర్తింపు పొందిన రకరకాల పిండి వంటలు నోరూరించాయి. అలాగే.. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ వేషధారణలు, డబ్బు వాయిద్యాలు, జానపద కళాకారులు సందర్శకులను ఆకట్టుకున్నారు. అలయ్ బలయ్‌పై గాయని మంగ్లీ ఆలపించిన గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలయ్.. బలయ్.. రుచులు అదిరాయ్