
పాతబస్తీలో కొత్త మార్గం
బార్కాస్ జంక్షన్ నుంచి చార్మినార్ వరకు తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు
● ఫలక్‌నుమా వద్ద రెండో ఆర్‌ఓబీ ప్రారంభం
● పాల్గొన్న మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని ఫలక్‌నుమా జంక్షన్ (జీమ్యాక్స్ కన్వెన్షన్) నుంచి ఫలక్‌నుమా బస్‌డిపోతో పాటు చార్మినార్ వరకు వెళ్లే వారికి ఇప్పటిదాకా ఉన్న ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సికింద్రాబాద్ –ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ లైన్‌లోని ఫలక్‌నుమా వద్ద ఇప్పటికే ఉన్న ఆర్‌ఓబీకి సమాంతరంగా రూ. 52.03 కోట్లతో నిర్మించిన కొత్త ఆర్‌ఓబీని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. పాత ఆర్‌ఓబీ పునరుద్ధరణతో పాటు కొత్త ఆర్‌ఓబీని నాలుగు వరుసల క్యారేజ్‌వేతో నిర్మించడంతో బార్కాస్ జంక్షన్ నుంచి ఫలక్‌నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎంతో సమయం ఆదాతో కావడంతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్ , ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జల్ఫికర్ అలీ, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఈ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించినప్పటికీ, ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు.

పాతబస్తీలో కొత్త మార్గం