
అన్వేషణ!
న్యూస్‌రీల్
సర్పంచ్ ఎన్నికలపై అందరిదీ అదే ధోరణి
బస్సెక్కితే బాదుడే! గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలతో ప్రయాణికులపై ప్రతి నెలా రూ.15 కోట్ల వరకు భారం పడనుంది.
అభ్యర్థుల కోసం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయపార్టీలు అడుగులు వేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మెజార్టీ సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావించే వారి పేర్లను సేకరించే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. ఈ నెల 8 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నాయి.
మంత్రి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థుల చిట్టా
ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాతే ఆయా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉండి.. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలపై పెట్టనుంది. జిల్లాలో 41 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని, రెండు జెడ్పీ పీఠాలను అధిష్టించాలని భావిస్తోంది.
కార్యకర్తల అభిప్రాయానికే బీజేపీ పెద్దపీట
అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావహుల పేర్లను నమోదు చేసుకుని సిద్ధంగా ఉంది. కోర్టు తీర్పు తర్వాతే కార్యాచరణ ముమ్మరం చేయనుంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్త వరకు అందరి అభిప్రాయాలు సేకరిం చిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరపున బీ–ఫాం అందజేయనుంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువే.
ఆచితూచి వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్
అభ్యర్థుల ఎంపికలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఆయన తన నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు. దీంతో ఆయా మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతను నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు సబితారెడ్డి చూసుకోవాల్సి వస్తోంది. ఆమె ఒక వైపు తన నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు దీటుగా బలమైన అ భ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.
పార్టీ రహితంగా జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తల అభిప్రాయం మేరకు వ్యవహరించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు నచ్చజెప్పాలని, అయినా వినకుంటే ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నాయి.

అన్వేషణ!