పండుగకు వెళ్లి వస్తుండగా..
పండుగకు వెళ్లి వస్తుండగా..
కందుకూరు: పండుగకు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలివీ.. కడ్తాల్ మండలం సలార్‌పూర్‌కు చెందిన నేనావత్ దేవేందర్, శిరీష దంపతులు. తమ ఇద్దరు కుమారులు సాత్విక్‌రాథోడ్ (అలియాస్ రాము), ప్రణీత్‌తో కలిసి దసరా పండుగకు బైక్‌పై మహేశ్వరం మండలం హర్షగూడలోని బంధువుల ఇంటికి గురువారం వెళ్లారు. తిరిగి శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో మండల పరిధిలోని అలిఖాన్‌పల్లి గేట్ సమీపంలో శ్రీశైలం రహదారిపై జియో పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి కింద పడ్డ సాత్విక్‌రాథోడ్(3) అక్కడికక్కడే మృతి చెందాడు. శిరీషకు రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. దేవేందర్‌తో పాటు ఏడాదిన్నర వయసున్న చిన్న కుమారుడు ప్రణీత్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. శిరీషను చికిత్స నిమిత్తం తుక్కుగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
● ముగ్గురికి గాయాలు
వ్యక్తి ఆత్మహత్య
కొడంగల్ రూరల్: చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని అయినన్‌పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశం(39) మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి గొడవ జరగడంతో బయటకు వెళ్లిపోయాడు. అయినన్‌పల్లి గేటు సమీపంలోని వెంచర్‌లో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి చిన్నాన్న నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ –2 సత్యనారాయణరాజు తెలిపారు. మృతుడికి భార్య లలితమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.