గెలిచేవారికే టికెట్‌! | - | Sakshi
Sakshi News home page

గెలిచేవారికే టికెట్‌!

Oct 5 2025 8:56 AM | Updated on Oct 5 2025 8:56 AM

గెలిచేవారికే టికెట్‌!

గెలిచేవారికే టికెట్‌!

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జెడ్పీటీసీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్‌ భావిస్తోంది. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ గెలుపొందిన దాఖలాల్లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉండటం, సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఈ ఎన్నికలను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుని తీరాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షినటరాజన్‌ సహా పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆదేశం మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం తన నివాసంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె.శంకరయ్య, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేఎల్లార్‌, చేవెళ్ల ఇన్‌చార్జ్‌ భీంభరత్‌, రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జ్‌ నరేందర్‌తో భేటీ అయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలాలు, బలహీనతలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

భేటీకి దూరం..

రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటిలో సరూర్‌నగర్‌, బాలాపూర్‌, హయత్‌నగర్‌, గండిపేట్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ పూర్తిగా జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యాయి. మిగిలిన 21 జెడ్పీటీసీ స్థానాలు సహా వికారాబాద్‌ జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్టీ గుర్తుపై నిర్వహించే ఈ ఎలక్షన్లను అధికార కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించింది. ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ ఇన్‌చార్జ్‌ల నుంచి అభ్యర్థుల పేర్లను సేకరించింది. వీరు ప్రతిపాదించిన అభ్యర్థులపై అంతర్గత సర్వే చేయించి, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సహా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా అధిష్టానానికి పలువురి పేర్లను ప్రతిపాదించారు. కానీ ఈ భేటికి మాత్రం దూరంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన గెలుపు గుర్రాలకే టికెట్‌ ప్రకటించనుంది.

ఆరు గ్యారంటీలే అస్త్రాలు

సంస్థాగతంగా పార్టీ కేడర్‌ మధ్య ఎలాంటి సమన్వయ లోపం తలెత్తకుండా చూసుకోవడంతో పాటు అన్ని స్థానాల్లోనూ గెలుపొందేలా ముందుకెళ్లాలని మంత్రి శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత కరెంట్‌, రూ.500లకే గ్యాస్‌ సరఫరా, వంటి పథకాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రెండేళ్లలో కాంగ్రెస్‌ సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి కాకుండా ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని బరిలో దింపడం ద్వారా సంస్థాగతంగా పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని, ఆదిశగా పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది.

సర్వే ఆధారంగానే జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక

ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్ల సేకరణ

ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ

స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement