
వేడుక ముగిసే.. వ్యర్థాలు మిగిలే
వేడుక ముగిసె.. వ్యర్థాలు మిగిలే
తుర్కయంజాల్: వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. గణనాథుడి నిమజ్జన క్రతువు అట్టహాసంగా జరిగింది. నెలరోజులు గడిచింది. కానీ చెరువు వద్ద సేకరించి, కట్టకింద డంప్ చేసిన వ్యర్థాలు మాత్రం అలాగే ఉన్నాయి. కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. అయినా సంబంధిత అధికారులు చెత్త తొలగింపును విస్మరించారు. నేటికీ చెత్తాచెదారం తొలగించేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
నాలుగు వేల విగ్రహాలు..
పురపాలక సంఘం పరిధి మాసబ్ చెరువులో గణనాథుల నిమజ్జన ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఉన్నతాధికారులు మెప్పు పొందారు. కాగా.. సుమారు నాలుగు వేలకు పైగా ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరాయి. ఆయా విగ్రహాలతో పాటు.. పూలు, పండ్లు, ఆకులు తదితర పూజా సామగ్రిని సైతం భక్తులు తెస్తుంటారు. అలా తెచ్చిన వాటిని సిబ్బంది సేకరించారు. అనంతరం వాటిని దూర ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు.. చెరువుకు రెండు వందల మీటర్ల దూరన డంప్ చేయించారు. నెలరోజులైనా ఆ వ్యర్థాలను అక్కడి నుంచి తీయకపోవడంతో సమీప కమ్మగూడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెలువడుతున్న దుర్వాసనతో ఇంట్లో ఉండలేక పోతున్నామని వాపోతున్నారు.
డంపింగ్ యార్డ్‌లా..
నిమజ్జన సమయంలో 24 గంటల పాటు శానిటేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఆ సమయంలో బిజీగా ఉండటం, సిబ్బంది కొరతతో తడి, పొడి చెత్తను వేరుచేయకుండా ఒకే చోట డంప్ చేశారు. ఆ తరువాత అయినా దానిని వేరు చేయాలనే ఆలోచనను మరిచారు. ఆ తరువాత వరుసగా భారీ వర్షాలు కురవడంతో.. ఆ చెత్త పెద్ద సమస్యగా మారింది. గతంలో నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు ఇక్కడ డంప్ చేసి, ఆ తరువాత ఇతరప్రాంతాలకు తరలించేవారు. కానీ ఈ సారి అలాగే వదిలేయడంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. ఇదిలా ఉండగా.. చెత్త తొలగించకపోవడంతో ఈ ప్రాంతం పందులకు ఆవాసంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. అపరిశుభ్రత వాతావరణం వలన దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. దీని కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు స్పందించి, నిమజ్జన వ్యర్థాలను వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చెరువు కట్ట కింద చెత్త డంప్
నెలరోజులైనా తొలగించని వైనం
దుర్వాసన, దోమలతోస్థానికుల ఇబ్బంది
పట్టించుకోని అధికార యంత్రాంగం
తొలగిస్తాం..
సిబ్బంది కొరతతో చెత్త తరలింపు ఆలస్యం అయింది. వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం.
– వనిత, శానిటరీ ఇన్‌స్పెక్టర్, మున్సిపాలిటీ