
మగువకే మకుటం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహిళా శక్తి మరింత బలపడుతోంది. విద్య, ఉపాధి రంగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లీడర్‌షిప్‌తో పాటు ఇతర అభ్యర్థుల గెలుపోటములను సైతం నిర్ణయిస్తూ.. పురుషులకు ఏమాత్రం తీసిపోబోమని నిరూపిస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లలోనూ అతివలకు పెద్దపీట వేశారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత జెడ్పీ పీఠం ఎస్సీకి రిజర్వ్ కాగా.. తొలిసారిగా మహిళా అభ్యర్థి(ఎస్సీ) చైర్‌పర్సన్‌గా ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో తొమ్మిది సీట్లను, 230 ఎంపీటీసీ స్థానాలకు గానూ 94 సీట్లను మహిళలకే కేటాయించారు. మరోవైపు తొమ్మిది ఎంపీపీ స్థానాల్లోనూ వీరే కొలువుదీరనున్నారు. ఇక 526 సర్పంచ్ స్థానాలు,4,668 వార్డులు ఉండగా.. 45శాతం స్థానాలను మగువలే దక్కించుకోనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య కొంత తగ్గినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లోనూ కీలకం కాబోతున్నారు.
ఆత్మీయ పలకరింపులు..
స్వయంగా పోటీలో నిలబడటంలోనే కాదు ఇతర అభ్యర్థుల గెలుపు ఓటముల్లోనే మహిళల ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. మహిళలు మాత్రమే అభ్యర్థుల తలరాతలను మార్చగలరు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని 526 పంచాయతీల్లో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు ఉన్నారు. ఇక మహిళలు 3,95,216 మంది ఉండగా.. ఇతరులు 33 మంది ఉన్నారు. బరిలో ఉన్న తోటి మహిళల గెలుపులోనే కాదు.. ఓటమిలోనే వీరే ఓట్లే కీలకం కాబోతున్నారు. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటికే వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. గతంలో మచ్చుకైనా మాట్లాడని పురుష నాయకులు ప్రస్తుతం.. అక్కా, అత్తా, అత్తా, అమ్మా.. అమ్మమ్మా అంటూ కొత్త వరసలు కలుపుతున్నారు. ఆత్మీయంగా పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీరు ఎవరిని ఆశీర్వదిస్తారో.. తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం
ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారి దక్కనున్న అవకాశం
తొమ్మిది మంది జెడ్పీటీసీలు, తొమ్మిది మంది ఎంపీపీలు కూడా వారే
94 ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలూ కేటాయింపు