
సమన్వయంగా ఎన్నికల నిర్వహణ
షాద్‌నగర్ రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీఓ బన్సీలాల్ అన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తహసీల్దార్ నాగయ్య మాట్లాడుతూ.. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి రద్దు
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్యక్రమం ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అర్జీలతో ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
అఖిల్ యాదవ్‌కు
ఉచిత మెడికల్ సీటు
కొడంగల్: పట్టణానికి చెందిన అఖిల్ యాద వ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలలో ఏ కేటగిరీ జన రల్ కోటాలో ఉచితంగా మెడికల్ సీటు సాధించాడు. శనివారం కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నట్లు అఖిల్ యాదవ్ తండ్రి ఏవీ పృథ్వి రాజ్ తెలిపారు. నీట్‌లో ర్యాంక్ రావడంతో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 469 మార్కులు రావడంతో కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ సీటు కేటాయించింది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌లో సీటు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ యాదవ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పృథ్విరాజ్, అనంతలక్ష్మి ప్రోత్సాహంతో సీటు సాధించినట్లు చెప్పారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి రోగులకు సేవ చేయనున్నట్లు తెలిపారు.
రూ.లక్ష పలికిన చీరలు
దుద్యాల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ధరించిన చీరలకు శనివారం వేలం నిర్వహించారు. మండలంలోని హస్నాబాద్‌లో మూడు చోట్ల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అక్కడ చీరలకు వేలం నిర్వహించారు. గౌడ్స్ కాలనీలో బాలగౌడ్ రూ.1.15 లక్షలకు దుర్గమ్మ చీరను సొంతం చేసుకున్నారు. గాంధీ చౌక్‌లో గోపాల్ ఆనంద్ రూ.1.17 లక్షలకు, వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద బీ సందప్ప రూ.95 వేలకు అమ్మవారి చీరను దక్కించుకున్నారు.
టెంట్ హౌస్ దగ్ధం
తాండూరు టౌన్: ప్రమాదవశాత్తు ఓ టెంట్ హౌస్ దుకాణం అగ్నికి ఆహుతైంది. షాపులోని సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన శనివారం తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నసీర్ అనే వ్యక్తి ఓ షెట్టర్‌లో ఎంఎస్ టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. షెట్టర్ నుంచి దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే దుకాణంలోని సామగ్రి కాలిపోయింది. పక్కనే ఉన్న ఆటోమొబైల్ షాపు, వెల్డింగ్ షాపులకు కూడా నిప్పంటుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని, దీనిపై విచారణ జరపాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు యజమాని నసీర్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమన్వయంగా ఎన్నికల నిర్వహణ

సమన్వయంగా ఎన్నికల నిర్వహణ