
ఊరిస్తున్న మబ్బులు
షాబాద్: మబ్బులు ఊరిస్తున్నాయి.. వాన ఎప్పుడు కురుస్తుందోనని రైతులు ఆకాశం వైపు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కాలంతో పాటు కార్తెలను నమ్ముకొని వ్యవసాయం చేస్తుంటారు. బలమైన కార్తెల్లో పంటలను సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు వస్తాయని రైతుల నమ్మకం. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాలు కూడా ఇరవై రోజులు ముందుగానే ప్రవేశించడంతో రోహిణి కార్తెలోనే వర్షాలు కురిశాయి. దాంతో రైతులు దుక్కులను దున్నుకొని సాగుకు సిద్ధం చేశారు. ఆ తరువాత ఆరుద్ర కార్తెలో కురిసిన అడపాదపా జల్లులకు పత్తి విత్తనాలను నాటారు. ఇరవై రోజులుగా వర్షాలు లేకపోవడంతో విత్తనాలు భూమిలోనే ఉండిపోయాయి. వాతావరణం చల్లబడుతోంది కానీ చినుకు మాత్రం నేలజారడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో లోటు వర్షపాతం
గత నెలలో జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కూడా చిరుజల్లులు మాత్రమే కురిశాయి. జూన్ నెలలో జిల్లాలో సగటున 10 రోజులు మాత్రమే వర్షం కురియగా, అధిక లోటు వర్షపాతమే రికార్డు అయింది.
పత్తికి మాత్రమే అనుకూలం
జూన్ నెలలో మొదటి, నాలుగో వారాల్లో కురిసిన మోస్తరు వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. గత నెల మొదటి వారంలో కురిసిన వర్షానికి రైతులంతా పత్తి గింజలు నాటారు. పక్షం రోజులు గడిచినా వానలు కురియకపోవడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే జూన్ చివరి వారం, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది.
వరి సాగు ఆలస్యం
సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు కురియకపోవడంతో వరి సాగు ఆలస్యం అవుతుంది. గత నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు రైతులు వడ్లను అలికారు. ప్రస్తుతం వరి పైరు నారు దశలో ఉంది. మరిన్ని వర్షాలు కురిస్తే నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బోర్లు లేని కర్షకులు ఇప్పటికీ వడ్లు అలకకుండా మరిన్ని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
ముఖం చాటేసిన వరుణుడు
వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు