
గండిపేటలో జలదోపిడీ
నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నిజాం కాలంలో నిర్మించిన గండిపేట జలాశయం ఇప్పుడు నీటి వ్యాపారులకు అడ్డాగా మారింది. జలాశయం చెంతనే ఉన్న రైతుల బోర్లను లీజుకు తీసుకుని అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ జలదోపిడీకి తెగబడుతున్నారు. జల వనరులను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ‘మూడు సంపులు.. ఆరు ట్యాంకర్ల’ చందంగా నిత్యం లక్షల లీటర్ల నీటిని నగరానికి తరలిస్తూ దర్జాగా ‘సొమ్ము’ చేసుకుంటున్నారు.
బోర్లు లీజుకు తీసుకుని.. సంపుల ఏర్పాటు
● ట్యాంకర్ల ద్వారా నిత్యం లక్షల లీటర్ల తరలింపు ● ‘సొమ్ము’ చేసుకుంటున్న అక్రమార్కులు ● వాల్టా చట్టానికి యథేచ్ఛగా తూట్లు ● పట్టించుకోని సంబంధిత అధికారులు
మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో నీటివ్యాపారులు బరితెగించారు. గండిపేట చెరువు ఒడ్డున ఉన్న రైతుల బోర్లను లీజుకు తీసుకున్నారు. చెరువు పక్కనే వ్యవసాయ పొలాల్లో గుంతలు తీసి టార్పలిన్లు వేసి తాత్కాలిక సంపులు నిర్మించారు. బోర్ల ద్వారా సంపుల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. సంపుల్లో నుంచి మోటార్ల ద్వారా వాటర్ ట్యాంకుల్లో నింపి నగరానికి తరలిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌లో 40 వేల నుంచి 50 వేల లీటర్ల నీటిని నింపుతున్నారు. ఒక్కో వ్యాపారి రోజుకు సుమారు 10–15 ట్యాంకర్ల ద్వారా లక్షల లీటర్ల నీటిని విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. గండిపేట చెరువు ఒడ్డున హిమాయత్‌నగర్ రెవెన్యూలో ఇలా సుమారు పదికి పైగా సంపులను ఏర్పాటు చేశారు.
చెరువు పక్కనే బోర్లువేసి..
నీటి వ్యాపారానికి వినియోగిస్తున్న బోర్లన్నీ గండిపేట చెరువు ఒడ్డునే ఉండటం గమనార్హం. ప్రస్తుతం చెరువులో నీళ్లు నిండుగా ఉండటంతో బోర్లలో సమృద్ధిగా వస్తున్నాయి. దీంతో వ్యాపారులకు కాసుల పంట పండుతోంది. వాల్టా చట్టం ప్రకారం నీటిని ఇష్టానుసారంగా తోడేసి వ్యాపారం చేయడానికి వీల్లేదు. కానీ రైతులు వేసిన బోర్లను లీజుకు తీసుకున్న వ్యాపారులు వాటి నుంచి ఇష్టానుసారంగా నీటిని తోడేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నగరానికి తరలించే నీటిని కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు, కార్పొరేట్ కంపెనీలకు, అపార్టమెంట్లలో విక్రయించి లబ్ధి పొందుతున్నారు. 40 వేల లీటర్ల ట్యాంకర్ నీటిని రూ.20 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వ్యాపారి నిత్యం సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
పట్టించుకోని అధికారులు
గండిపేట జలాశయం ఒడ్డున జోరుగా నీటివ్యాపారం జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. జలమండలి అధికారులగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటి వ్యాపారులకు స్థానిక నేతలతోపాటు పోలీసులు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చర్యలు తీసుకుంటాం
గండిపేట చెరువు ఒడ్డున్న ఉన్న బోర్ల నుంచి నీటివ్యాపారం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని జలమండలి అధికారులకు సైతం తెలియజేశాం. ఇప్పటికే మూడు బోర్లు సీజ్ చేశాం. నీటిని తరలిస్తున్న ట్యాంకర్లపై కేసులు నమోదు చేయించాం. నీటి వ్యాపారం ఇలాగే కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయిస్తాం.
– గౌతమ్‌కుమార్, తహసీల్దార్, మొయినాబాద్