
పావుకిలో చాలు
● కొండెక్కిన కూరగాయల ధరలు ● వారంలోనే అమాంతం పెరుగుదల ● ఏది కొనాలన్నా కిలో రూ.60 పైమాటే.. ● ఆకుకూరలదీ అదే పరిస్థితి ● కిలో కొనేవారు పావుకేజీతో సరి
హుడాకాంప్లెక్స్: పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.30కే లభించగా ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో రూ.75 ధర పలుకుతోంది. అదే బహిరంగ మార్కెట్లో రూ.100 దాటింది. టమోటా కేజీ రూ.15లోపే ఉండగా రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. బెండకాయ, కాకరకాయ, వంకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ ఇలా ఏ కూరగాయ కొనాలన్నా కిలోకి రూ.60పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆకుకూరల ధరలు సైతం పెరుగుతూ పోతున్నాయి. పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, తోటకూర ఇలా ఏ ఆకుకూర ధర చూసినా కట్టను బట్టి ఒక్కో కట్టకు రూ.7నుంచి రూ.10 చెల్లించాల్సి వస్తోంది. గతంలో కిలో కూరగాయలు కొనుగోలు చేసిన వారు పెరిగిన ధరలతో ప్రస్తుతం పావు కిలోతో సరి పెట్టుకుంటున్నారు. జిల్లాలోని సరూర్‌నగర్, ఎన్‌టీ ఆర్‌నగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, షాద్‌నగర్ మార్కెట్లతో పాటు కాలనీలు, బస్తీల్లో నిర్వహించే వారాంతపు సంతల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
భారీగా తగ్గిన సాగు
జిల్లా కాయగూరల సాగుకు పెట్టింది పేరు. ఒకప్పుడు హైదరాబాద్ నగరవాసులకు సరిపడా ఇక్కడే పండించే వారు. ఇబ్రహీంపట్నం, యాచారం, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, మహేశ్వరం మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో సాగు చేసేవారు. వ్యవసాయ భూములన్నీ ప్రస్తుతం రియల్టర్ల చేతుల్లోకి వెళ్లడం, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, చీడపీడల నేపథ్యంలో సాగు గణనీయంగా పడిపోయింది. 2021–22 వానాకాలంలో 14,096 ఎకరాల విస్తీర్ణంలో, యాసంగిలో 19,222 ఎకరాల విస్తీర్ణంలో సాగవగా 3,08,460 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుత వానాకాలంలో ఐదు వేల ఎకరాలకు మించి సాగవడం లేదు. మార్కెట్లో డిమాండ్ మేర దిగుబడి లేకపోవడంతో ఉమ్మడి ఏపీ జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చుల భారం సైతం కొనుగోలుదారులపై పడుతోంది.
రేట్లు భారీగా పెరిగాయి
వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయి. గతవారం వరకు రూ.200 తీసుకుని మార్కెట్‌కు వెళ్తే వారానికి సరి పడా కాయగూరలు వచ్చేవి. ఆ డబ్బులతో ప్రస్తుతం రెండు మూడు కిలోలు కూడా రావడం లేదు. గతంలో కిలోకి తగ్గకుండా కొనేదాన్ని. ప్రస్తుతం పావు కేజీతో సరిపెట్టుకుంటున్నా. పప్పుల ధరకు దీటుగా పచ్చిమిర్చి ధర పలుకుతోంది.
– విజయలక్ష్మి, గృహిణి
గిరాకీ ఉండడం లేదు
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సాగైతే కానీ ఽఇప్పట్లో ధరలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారం కూడా లాభసాటిగా సాగడం లేదు. గతంలో రోజుకు రూ.2000 విలువ చేసే కాయగూరలను అమ్మితే ప్రస్తుతం రూ.500 కూడా అమ్మలేకపోతున్నాం. ఒకప్పుడు కిలో కొనుగోలు చేసే వారు సైతం ప్రస్తుతం పావు కిలో తీసుకెళ్తున్నారు.
– లక్ష్మయ్య, వ్యాపారి