
చోటు లేక.. లోపలికి వెళ్లలేక
● కదులుతున్న బస్సు నుంచి జారి పడిన యువతి
యాచారం: సరిపడా ఆర్టీసీ బస్సు సర్వీసులులేక విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు ఎదుర్కొంటున్నా అధికార యంత్రాంగంలో కదలిక లేదు. తాజాగా కిక్కిరిసిన బస్సులో ఎక్కిన ఓ యువతి ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తూ జారి పడిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అయ్యవారిగూడేనికి చెందిన అఖిల నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. రోజు మాదిరిగానే స్వగ్రామం వెళ్లడానికి గురువారం సాయంత్రం యాచారంలోని అంబేడ్కర్ చౌరస్తాలో యాచారం–కందుకూరు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు అధికంగా ఉండడంతో ఫుట్‌బోర్డు నుంచి లోపలికి వెళ్తుండగా బస్సు కదిలింది. ప్రయాణికుల రద్దీతో పట్టుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఆమె అదుపుతప్పి జారి కిందపడి పోయింది. వెంటనే ఆమెను యాచారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. యాచారం–కందుకూరు రూట్లో అదనపు బస్సు ట్రిప్పులు పెంచాలని స్థానికులు డిమాండ్ చేశారు.