
లెక్క తేలింది!
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు
● జిల్లాలో 21 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీలు ● కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో తగ్గిన 32 సర్పంచ్, 27 ఎంపీటీసీ స్థానాలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎట్టకేలకు ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఆయా స్థానాల జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటి పరిధిలో 21 జెడ్పీటీసీ స్థానాలు సహా మరో 230 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. కొత్తగా మెయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఎంపీటీసీ స్థానాలతో పాటు గ్రామ పంచాయతీల సంఖ్య కూడా తగ్గింది. 2019లో జిల్లాలో 257 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 230కి చేరింది. 27 ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. గతంలో 558 గ్రామ పంచాయతీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 526కు చేరింది. వీటి పరిధిలో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు, 3,95,216 మంది మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లో ఎన్నికల హడావుడి మొదలు కానుంది.
నోటిఫికేషన్ రావడమే ఆలస్యం
2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థలకు పాలకమండళ్లు లేక 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో తాగునీటి బోర్లకు రిపేర్లు, వీధిలైట్లు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొన్ని పంచాయతీల్లో అధికారులు అప్పులు చేయాల్సి వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీ కోటాను అమలు చేయాలని కోరుతూ కొంత మంది కోర్టును ఆశ్రయించడం, ఇదే అంశంపై హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, మూడు మాసాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది. నోటిఫికేషన్ జారీ చేయడమే ఆలస్యం ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదే సమయంలో జిల్లా యంత్రాంగం జిల్లా ప్రాదేశికాలు, మండల ప్రాదేశికాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఈ పని దాదాపు పూర్తి చేసినట్లు తెలిసింది. పోలింగ్‌బూత్‌ల వారీగా బీఎల్‌ఓలను నియమించి, వారికి శిక్షణ సైతం పూర్తి చేసింది.
మున్సిపాలిటీల్లో విలీనం
● చేవెళ్ల మండల పరిధిలో 37 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో 12 గ్రామాలు కొత్తగా ఏర్పాటు చేసినా మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాలకు.. ప్రస్తుతం ఏడు స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.
● మెయినాబాద్ మండల పరిధిలో గతంలో 28 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో తొమ్మిది గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దీంతో తొమ్మిది సర్పంచ్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఎనిమిదింటిని కోల్పోవాల్సి వచ్చింది.
● శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడ, మీర్జాగూడలను ఇటీవల నార్సింగి మున్సిపాలిటీలో విలీనం చేయగా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తారామతిపేట్, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం గ్రామాలను పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఆ మండలంలో నాలుగు సర్పంచ్, మూడు ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.
● కొత్తూరు మండలంలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా, మున్సిపాలిటీ ఏర్పాటుతో కొత్తగా నాలుగు స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ, శంకరాపురం, రషీద్‌గూడ, హమీదుల్లానగర్, బహదుర్‌గూడ పంచాయతీలను ఇటీవల శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు సహా ఆరు సర్పంచ్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.