
సాగు సంక్షోభం
వర్షాలు కురవక తగ్గిన సేద్యం
వానాకాలం సాగు వివరాలు
పంట అంచనా సాగైన పంటలు
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
వరి 1,40,238 2,8510
జొన్న 5,562 3,608
సజ్జ 21 5
మొక్కజొన్న 52,207 50,922
రాగులు 30 2
కంది 14,308 14,563
ఆముదం 37 8
పత్తి 1,41,088 1,26,486
ఇతర పంటలు 4,382 1,500
యాచారం: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో భారీ వర్షాల జాడే లేదు. ముసురు వర్షాలకే రైతులు సాగు ప్రారంభించారు. జిల్లా వ్యవసాయాధికారులు ఈ ఏడాది సాగు విస్తీర్ణం 3,58,089 ఎకరాలుగా అంచనా వేశారు. జూన్ 10 తర్వాత రెండు, మూడు రోజుల పాటు అడపాదడపా కురిసిన ముసురుకు రైతులు పత్తి, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేశారు. ఆ తర్వాత వరుణుడు మొహం చాటేయడంతో మొలకెత్తిన పంటలు వట్టిపోతాయోమానని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టామని వర్షాలకు కురవక పోతే పంటల ఎదుగుదల కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి పంటపైనే ఆశలు
గతేడాది పత్తి పంట సాగుతో రైతుకు ఊహించని దిగుబడి, ధరలు వచ్చి లాభాలు ఆర్జించాడు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఏడాది లక్షన్నర ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేసింది. జిల్లాలోని మాడ్గుల, యాచారం, మంచాల, కేశంపేట, షాబాద్, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, షాద్‌నగర్, కందుకూరు, మహేశ్వరం తదితర మండలాల్లో 1,26,486 ఎకరాల్లో తెల్లబంగారం సాగు చేపట్టారు. మే నెలలో కురిసిన కొద్ది పాటి వర్షానికే కొందరు రైతులు పొలాలను సిద్ధం చేసుకుని ఆ వెంటనే పత్తి పంటను సాగు చేయగా, మరికొందరు జూన్‌లో కురిసిన వర్షాలకు పత్తి విత్తుకున్నారు.
వరి పంటకు గడ్డుకాలమే..
1,40,238 ఎకరాల్లో వరి పంట సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు కేవలం 29 వేల ఎకరాల్లోనే సాగుచేపట్టారు. ఆశించిన వర్షాలు లేకపోవడంతో బోరు బావుల్లో భూగర్భజలాలు అడుగంటిని పరిస్థితి. భారీ వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగి నీరు అందే అవకాశం ఉంది.
24.07 లోటు వర్షపాతం
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వర్షపాతం సాధారణంగానే ఉంది. జూన్‌లో 97.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నేటికి కేవలం 73.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతమే కురిసింది. అంటే జూన్‌లోనే 24.07 మిల్లీ మీటర్ల సగటు లోటు వర్షపాతం నమోదయింది. యాచారం, మంచాల, మహేశ్వరం, మాడ్గుల, కేశంపేట, ఇబ్రహీంపట్నం, షాబాద్ మండలాల్లోనే కొంచెం అత్యఽధిక వర్షపాతం నమోదవగా. కడ్తాల్, ఫరూఖ్‌నగర్, చేవెళ్ల, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, కందుకూరు, కొందుర్గు, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, శంషాబాద్ తదితర మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయింది. వర్షపాతం అత్యధికంగా ఉన్న మాడ్గుల, యాచారం, కేశంపేట, షాబాద్ తదితర మండలాల్లో పత్తి పంట సాగుకే మొగ్గు చూపారు.
వరి పంటకు గడ్డుకాలం
పదిరోజుల్లో వర్షాలు కురిస్తేనే పత్తి పంట ఎదుగుదల
వర్షాలు కురిస్తేనే..
భారీ వర్షాలు కురిస్తేనే వరి పంటకు జీవం పోసినట్లు అవుతుంది. ఇప్పటికే రైతులు వరి నార్లు పోసుకున్నారు. వారం, పది రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే నాట్లకు ఇబ్బంది ఉండదు. పత్తి పంట బాగా ఎదుగుతుంది. కొద్ది రోజులుగా వర్షాల జాడే లేకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. గతేడాది అధిక లాభాల దృష్ట్యా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి పంటపై రైతులు ఆసక్తి చూపారు. వర్షాలు కురిస్తే ఇతర పంటల సాగు విస్తీర్ణం కూడ పెరిగే అవకాశం ఉంటుంది.
– డి.ఉష, జిల్లా వ్యవసాయాధికారి

సాగు సంక్షోభం