త్వరలో మాన్సూన్ టీమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాల సమస్యలను ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా జీహెచ్‌ఎంసీ దాదాపు 400 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను ఏర్పాటు చేయనుంది. వచ్చే జూన్ ఆరంభం నుంచి వర్షాకాలం ముగిసేంత వరకు (అక్టోబర్ నెలాఖరు వరకు) ఈ టీమ్స్ పని చేస్తాయి. ఇందుకుగాను దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేయనున్నారు. వర్షాకాలంలో వానొస్తే రోడ్లు, కాలనీలు నీటి నిల్వలతో చెరువులుగా మారడం, మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్లు పొంగిపొర్లడం తెలిసిందే. ఈ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ టీమ్స్ పనిచేస్తాయి. నగరంలో ప్రతియేటా నీరునిల్వ ఉండే ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలోని సంబంధిత అధికారులకు తెలుసు. అలాంటి ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్ నియమిస్తారు. నిల్చిపోయే నీటిని ఎప్పటికప్పుడు టీమ్స్‌లోని కార్మికులు తోడి పోస్తారు. వీటితో పాటు వాహనాలతో కూడిన మొబైల్ టీమ్స్ కూడా ఉంటాయి. ఇవి కాలనీలు, బస్తీలతో పాటు ఎక్కడ నీరు నిలిచినా వెళ్లి తొలగిస్తాయి. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు అందే ఫిర్యాదులను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్లి నిల్వ నీటిని తొలగిస్తాయి. షిఫ్టులవారీగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పని చేస్తాయి. ఈ టీమ్స్‌లోని కార్మికులు నీరు తోడిపోసేందుకు, అవసరమైన ప్రాంతాల్లో స్వల్ప మరమ్మతులు చేసేందుకు యంత్ర సామగ్రిని కలిగి ఉంటారు. వీటి ఏర్పాటు కోసం జోన్లలో సర్కిళ్ల వారీగా సంబంధిత ఈఈలు టెండర్లు పిలుస్తున్నారు.
మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇలా..
ఒక్కో టీమ్‌కు వాహనం, నలుగురు కార్మికులు, నీటిని తోడి పోసేందుకు పరికరాలు ఉంటాయి. షిఫ్టుల వారీగా ఈ టీమ్స్ పనిచేస్తాయి. ఇలాంటి టీమ్స్ దాదాపు 150 వరకు ఉంటాయి.
స్టాటిక్ టీమ్స్
నీరు అధికంగా నిలిచిపోయి రోడ్లు చెరువులుగా మారే ప్రాంతాల్లో, క్యాచ్‌పిట్ల వద్ద ఒకరు లేదా ఇద్దరు కార్మికులతో ఈ టీమ్స్ ఉంటాయి. వీటిల్లోని కార్మికులు నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తోడిపోస్తారు.ఇలాంటి టీమ్స్ దాదాపు 250 ఉంటాయి.
జీహెచ్‌ఎంసీ అని తెలిసేలా..
మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ వాహనాలకు జీహెచ్‌ఎంసీ లోగోతో బోర్డు పెట్టాలని, టీమ్‌కు నేతృత్వం వహించే వారి ఫోన్ నంబర్లను అన్ని పోలీస్‌స్టేషన్లకు అందజేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఇటీవల జరిగిన వర్షాకాల సన్నద్ధత సమావేశంలో ఆదేశించారు. వర్షాల సమయంలో ఇంజినీర్లు సైతం 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అంతేకాకుండా వాటర్ లాగింగ్ సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించిన కమిషనర్ బేగంపేటలో నీటి నిల్వకు కారణాన్ని గుర్తించి పై నుంచి వచ్చే నీటిని నియంత్రించేందుకు స్లూయిస్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించడం తెలిసిందే.
వర్షాకాల ఇబ్బందుల పరిష్కారానికి..
టెండర్లు ఆహ్వానిస్తున్న జీహెచ్‌ఎంసీ


