అకాల వర్షం.. మిగిలిన నష్టం
కొందుర్గు: అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మంగళవారం కొందుర్గు మండలంలోని ఆగిర్యాల, వెంకిర్యాల, లక్ష్మీదేవిపల్లి, ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వానలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆయా అన్నదాతలు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి చాలిచాలని నీటిని రాత్రింబవళ్లు పొలానికి పెట్టి పండించిన పంట నేలపాలు కావడంతో విలవిలల్లాడుతున్నారు. ఆగిర్యాలకు చెందిన చించోడి మొగులయ్య, పందిబండ రామచంద్రయ్య, గుమ్మడి వెంకటయ్య, గుమ్మడి రామచంద్రయ్య, మహదేవ్‌పూర్ రాములు, నర్సిరెడ్డి తదితర రైతులకు సంబంధించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉద్యానవన శాఖ అధికారి హిమబిందు, ఏఈఓ రమణ, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ ఆయా గ్రామాలను సందర్శించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాగా ఆగిర్యాల గ్రామంలో 27 మంది రైతులకు సంబంధించిన 28 ఎకరాల వరిపంట దెబ్బతిందని వ్యవసాయ విస్తరణాధికారి రమణ తెలిపారు. అలాగే 176 మంది కర్షకులకు సంబంధించి 216 ఎకరాల్లో మామిడి చెట్లకు కాయలు రాలిపోయాయని షాద్‌నగర్ ఉద్యానవన అధికారి హిమబిందు పేర్కొన్నారు.
విరిగిన బొప్పాయితోట
ఫరూఖ్‌నగర్ మండలంలోని దేవునిపల్లికి చెందిన జంగయ్య అనే రైతుకు సంబంధించిన బొప్పాయితోట గాలివానకు విరిగి పూర్తిగా నేలపై పడిపోయాయి. దాదాపు 70 శాతానికి పైనే రైతు నష్టపోయాడని ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. దెబ్బతిన్న పంటల వివరాలను రైతులవారీగా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొంటున్నారు. అకాల వర్షాలకు తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
రాలిన మామిడిని పరిశీలిస్తున్న అధికారులు
దెబ్బతిన్న వరి పంటను చూపుతున్న రైతన్న
వడగళ్ల వానలకు
నేలరాలిన వరి, మామిడి
పంటలను పరిశీలించిన అధికారులు


