
ఉపాధి పనుల్లో వేగం పెంచండి
యాచారం: ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పర్యటనలో భాగంగా ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఈజీఎస్ ఏపీఓ లింగయ్యతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జాబ్ కార్డు ఉన్న ప్రతీ కూలీ ఉపాధి పనులకు హాజరయ్యేలా చూడాల ని సూచించారు. వేసవి నేపథ్యంలో కూలీలు పని చేసే చోట అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరం, జెడ్పీ అతిథి గృహాన్ని పరిశీలించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మార్చి 25 వరకు 24 పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు కు కృషి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉదయమే పనులు చేసుకోవాలి
కందుకూరు: ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి కూలీలకు సూచించారు. బుధవారం కందుకూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీర్‌ఖాన్‌పేట పరిధిలో కొనసాగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించి కూలీలతో మాట్లాడారు. ఉదయమే త్వరగా వచ్చి పనులు చేసుకోవాలని కోరారు. కొలతల ప్రకారం పనులు చేసి రూ.300 చొప్పున కూలీ పొందాలన్నారు. పని ప్రదేశంలో తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమీపంలో కొనసాగుతున్న నర్సరీని పరిశీలించారు. అంకురోత్పత్తి రాని బ్యాగుల్లో మళ్లీ విత్తనాలు లేదంటే నారు నాటాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ సరిత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, ఏపీఓ రవీందర్‌రెడ్డి, టీఏలు గోపాల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం పన్నులు వసూలు చేయాలి
జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి