
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలోని పలు హాస్టళ్లపై ఫుడ్‌సేఫ్టీ, టౌన్‌ప్లానింగ్, హెల్త్, తదితర విభాగాల అధికారులతో ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. నగరంలోని పలు హాస్టళ్లు నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కనీస పరిశుభ్రత పాటించకపోవడంతో హాస్టళ్లలో ఉంటున్న వర్కింగ్ మెన్, ఉమెన్, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పార్కింగ్ సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగించడం, భారీ హోర్డింగులతో వ్యాపారం చేయడం, ఇరుకు గదుల్లో ఎక్కువ మందిని కుక్కడం, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, కనీస ఫైర్‌సేఫ్టీ లేకపోవడం, శుభ్రత, నాణ్యత లేని ఆహారం సరఫరా ,ఇతరత్రా లోపాలు కోకొల్లలు. పలు మార్లు హెచ్చరించినా యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు.ఈ నేపథ్యంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట ప్రాంతాల్లోని ని 58 హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నాయి.
● అశోక్‌నగర్ ప్రాంతంలో 20 హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి ఫుడ్‌లైసెన్సు లేకుండా, అపరిశుభ్రతతో ఆహారం తయారు చేస్తున్న రెండింటిని మూసివేశారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఎనిమిదింటికి నోటీసులు జారీ చేశారు. 9 హాస్టళ్లకు రూ.37,500 పెనాల్టీ విధించారు.
● దిల్‌సుఖ్ నగర్‌లో 23 హాస్టళ్లను తనిఖీ చేసి ఫుడ్‌సేఫ్టీ లైసెన్సులేని రెండింటిని మూసివేశారు. ఏడింటికి నోటీసులు జారీ చేశారు. ట్రేడ్‌లైసెన్సులు లేని 11 హాస్టళ్లకు రూ.23వేల పెనాల్టీ విధించారు.
● అమీర్‌పేటలో 15 హాస్టళ్లను తనిఖీ చేసి దేనికీ ట్రే డ్ లైసెన్సు లేకపోవడాన్ని గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు రూ.1.85 లక్షల పెనాల్టీ విధించారు. ఫుడ్‌సేఫ్టీ లైసెన్సు లేని ఒక కిచెన్‌ను మూసివేశారు.
నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు
రూ. 2,45,500 పెనాల్టీ విధింపు
30 హాస్టళ్లకు నోటీసులు..
కొన్నింటి మూసివేత